Kuwait Fire Accident in Building: కువైట్‌లోని మంగాఫ్ నగరంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ  ప్రమాదంలో మరణించిన భారతీయుల సంఖ్య 49కి చేరింది. మరికొందరు భారతీయులు గాయపడ్డారు. ఆరు అంతస్తుల భవనంలో ఉన్న వంటగదిలో మంటలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. భవనంలో దాదాపు 160 మంది ఉంటున్నట్లు  వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 90 మంది భారతీయులను రక్షించారు. మంటలు అదుపులోకి వచ్చాయని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి కారణమేంటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  


విచారం వ్యక్తం చేసిన మోదీ
కువైట్ నగరంలో జరిగిన అగ్నిప్రమాద  ఘటనపై ప్రధాని మోదీ  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.  ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో కువైట్ నగరంలో జరిగిన అగ్నిప్రమాదం చాలా బాధాకరమని తెలియజేశారు.  ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తోందని మోదీ చెప్పారు.  ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందేలా చూడడానికి ప్రధాని మోదీ ఆదేశాల మేరకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అత్యవసరంగా కువైట్‌కు వెళ్తున్నారు. 






ఈ ఘటనపై  స్పందించిన మల్లికార్జున ఖర్గే
ఈ ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. కువైట్‌లో చాలా మంది భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని.. చాలా మంది గాయపడ్డారని తెలిసి చింతిస్తున్నట్లు తెలిపారు.  అంతేకాకుండా, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.  బాధితులకు,  వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నట్లు  ఖర్గే ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు.






భవన యజమాని అరెస్ట్ కు ఆదేశాలు
ఈ సంఘటన తర్వాత కువైట్  మంత్రి షేక్ ఫహాద్ అల్-యూసుఫ్ అల్-సబాహ్ భవనం యజమానిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు.  గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని అనేక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించేందుకు వైద్య బృందాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ   ప్రకటనలో  పేర్కొంది.


హెల్ప్‌లైన్ నంబర్‌ విడుదల  
ఈ సంఘటన తర్వాత భారత రాయబార కార్యాలయం  హెల్ప్‌లైన్ నంబర్ +965-65505246, మెయిల్ ఐడిని ప్రకటించింది. దీని ద్వారా బాధిత కుటుంబం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మంటలు చెలరేగిన భవనం ఆరు అంతస్తులు ఉంటుందని చెబుతున్నారు. దాని వంటగదిలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు భీకర రూపం దాల్చి భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఈ భవనంలో ఒకే కంపెనీలో పనిచేస్తున్న సుమారు 160 మంది నివసిస్తున్నారు. ఇందులో చాలా మంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు.


ఆసుపత్రిని సందర్శించిన భారత రాయబారి 
కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా ఈరోజు కువైట్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడిన 30 మంది చికిత్స పొందుతున్న  అల్-అదాన్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ రోగులను కలుసుకుని వారికి ఎంబసీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.