Chandrababu Meets AP New Ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కొత్త మంత్రివర్గంతో సమావేశం అయ్యారు. ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన అందరూ మంత్రులు ఈ భేటీకి హాజరు అయ్యారు. పవన్ కల్యాణ్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. 


ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు కొత్త మంత్రులతో సమావేశం అయి వివిధ అంశాలపై చర్చించారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు మంత్రులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సాయంత్రానికే మంత్రులకు శాఖలు ఫైనల్ కానున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో సమావేశంలో నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, ఎన్‌ ఎమ్‌ డీ ఫరూక్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేశ్‌, టీజీ భరత్‌, ఎస్‌.సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌రెడ్డి, మందిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తిరుపతికి చంద్రబాబు ఫ్యామిలీ
ప్రమాణ స్వీకారం అయిన నేడు రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా రేపు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఆ సమయంలో తిరుమలకు వెళ్లనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లనున్నట్లు తెలిసింది.


తిరుమలలోని శ్రీగాయత్రి గెస్ట్‌ హౌస్‌లో సీఎం చంద్రబాబు రాత్రి బస చేసి.. గురువారం (జూన్ 13) ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామిని చంద్రబాబు, ఆయన కుటుంబం దర్శించుకోనుంది. తిరుమలోని శ్రీ భూవరాహ స్వామి ఆలయాన్ని కూడా చంద్రబాబు, కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు.