CM Chandrababu Will Takes Charges On June 13th: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు (Chandrababu).. గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4:41 గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి వాటిపైనా ఆయన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తిరుమలకు చంద్రబాబు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు బుధవారం సాయంత్రం కుటుంబంతో సహా తిరుమలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం సాయంత్రం సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అటు, సీఎం తిరుమల పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు పటిష్ట ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.
మంత్రులతో భేటీ
అటు, ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు సీఎంకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రానికి మంత్రుల శాఖలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు తిరుమలకు కుటుంబంతో కలిసి బయలుదేరి వెళ్లారు.