Kurnool Crime News: మైనర్ గా ఉన్నప్పుడే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో పోలీసులు అతడిని జైలుకు పంపారు. బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి కాపురం పెట్టారు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ బాబు కూడా పుట్టాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోయింది. అతడూ తాగుడికి బానిసై ఆమెను హింసించేవాడు. ఈ క్రమంలోనే మరో యువకుడు పరిచయం కావడంతో.. భర్తను చంపేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో అతడు ఈమె భర్తను రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు. పూర్తిగా కాలిపోక ముందే మృతదేహాన్ని హంద్రీ నది ఒడ్డున పడేసి పారిపోయాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు.
అసలేం జరిగిందంటే..?
ఆల్వాలకు చెందిన ఆమోస్, అరుణ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు అరుణ మైనర్ కావడంతో ఆమోస్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమోస్ జైలుకు వెళ్లాడు. ఆమె మేజర్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి కాపురం పెట్టారు. కొన్నాళ్ల పాటు వీరి జీవితం హాయిగా సాగింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం అఖిల్ వయసు ఐదేళ్లు. కర్నూలులోని ఉద్యోగ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే నగరంలోని సిటీ స్క్తెర్ మాల్ లో ఆమోస్ సెక్యూరిటీ గార్డుగా, కాంప్లెక్స్ లోని వస్త్ర దుకాణంలో అరుణ సేల్స్ గర్ల్ గా పని చేసేవారు. మద్యానికి బానిస అయిన ఆమోస్ రోజూ భార్యను వేధించేవాడు. అయితే వీరి ఇంటి సమీపంలో ఉండే ములకల సూర్య ప్రదీప్ ఓ ప్రైవేటు పాఠశాలలో కంప్యూటర్ ఆపరేట్ గా పని చేస్తూ సాయంత్రం సమయంలో ఆటో నడిపేవాడు. అప్పుడప్పుడూ భార్యాభర్తలు ఇతని ఆటోలో వెళ్లేవారు.
నా భర్తను చంపి అడ్డు తొలగిస్తే.. నిన్ను పెళ్లి చేసుకుంటా..!
ఈ క్రమంలోనే ఆమోస్ కు సూర్య ప్రదీప్ కు పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. దీంతో సూర్య ప్రదీప్ తో అరుణకు కూడా పరిచయం ఏర్పడింది. తన భర్తను చంపి అడ్డు తొలగిస్తే.. నిన్ను పెళ్లి చేసుకుంటానని సూర్య ప్రదీప్ తో అరుణ చెప్పింది. దీంతో అతడు హత్యకు పథక రచన చేసి తన స్నేహితుడు జీవన్ కుమార్ కు విషయం చెప్పాడు. 22వ తేదీ రాత్రి సూర్య ప్రదీప్, జీవన్ కుమార్.. ఆమోస్ ను తీసుకొని శరీర్ నగర్ సవారీతోట హంద్రీ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు. ఆపై వెంట తెచ్చుకున్న ఫ్యాను రాడ్డుతో బలంగా కొట్టి చంపేశారు. సూర్య ప్రదీప్ పెట్రోల్ తీసి నిప్పంటించాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో హంద్రీ ఒడ్డుకు తీసుకెళ్లి పడేసి వెళ్లిపోయాడు. తర్వాత అరుణకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
అరుణతో పాటు మరో ఇద్దరి అరెస్ట్
అయితే ఈనెల 24వ తేదీన స్థానికుల ద్వారా ఆమోస్ మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అరుణపై అనుమానం వచ్చి తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో ఆమె జరిగిన కథనంతా చెప్పింది. వెంటనే పోలీసులు అరుణతోపాటు ఆమె ప్రియుడు సూర్య ప్రదీప్, జీవన్ కుమార్ లను అరెస్ట్ చేశారు. కర్నూలులోని కార్యాలయంలో డీఎస్పీ కేవీ మహేష్ కుమార్, సీఐ శంకరయ్యలు మీడియా ముందుకు తీసుకొచ్చి వివరాలు వెల్లడించారు.