Just In





Himanshu Farming with KCR : ఫామ్ హౌస్‌లో చెట్టు నాటిన హిమాన్షు - పక్కనే ఉండి సూచనలు చేసిన కేసీఆర్- వీడియో వైరల్
Himanshu Farming with KCR : సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో హిమాన్షు మొక్కలు నాటుతుండగా.. పక్కనే నిల్చొని కేసీఆర్ మనుమడికి మార్గనిర్దేశం చేశారు.

Himanshu Farming with KCR : మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు హిమాన్షు రావు.. తన తాత, బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తో కలిసి ఉన్న ఓ స్ఫూర్తిధాయక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక విషయాలను నొక్కి చెబుతున్నాయి. ఇందులో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తాత కేసీఆర్ పర్యవేక్షణలో వ్యవసాయ పనులు చేస్తూ కనిపించాడు. హిమాన్షు తన తాత మార్గదర్శకత్వంలో నడుస్తున్నట్టు దీని ద్వారా ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నేలను చదును చేయడం, చెట్లు నాటడం వంటి పనులు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను షేర్ చేసిన హిమాన్షు.. "ఉత్తమమైన వాటి నుండి నేర్చుకోవడం. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం. మన సహజ వనరులను రక్షించుకోవడం, సంరక్షించడం మన బాధ్యత" అని క్యాప్షన్ లో రాశాడు.
పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ప్రోత్సహించడంలో, పెద్దల నుండి సాంప్రదాయ పద్ధతులను నేర్చుకోవడంలో యువతరం పాత్రను హైలైట్ చేసే ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హిమాన్షు చెట్ల పెంపకంలో చురుకుగా పాల్గొనడం తెలంగాణలో పర్యావరణ స్థిరత్వం గురించి అవగాహన కల్పించడానికి అతని కుటుంబం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వీడియో ప్రతిబింబంగా నిలుస్తోంది.
వీడియోలో ఏముందంటే..
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో హిమాన్షు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. చేతిలో పలుగు, పారతో వ్యవసాయ పనులను చేస్తూ.. మొక్కల కోసం గుంత తవ్వాడు. మొక్కలు నాటుతూ వాటికి పురుగు లాంటివి పట్టకుండా ఎరువులు చల్లి.. నీళ్లు పోశాడు. ఇక హిమాన్షు ఈ పనులు చేస్తున్నప్పుడు కేసీఆర్ పక్కనే నిల్చొని సూచనలిచ్చారు. వ్యవసాయం, మొక్కల పెంపకం గురించి కూడా క్షుణ్ణంగా వివరించినట్టు తెలుస్తోంది.
హిమాన్షు గురించి
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న హిమాన్షు.. అంతకుముందు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదివాడు. అప్పట్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డేన జరిగిన వేడుకల్లో పట్టాను అందుకుంటున్న పోస్ట్ తెగ వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత - నాయనమ్మ కేసీఆర్ - శోభ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్ - శైలిమ, చెల్లి అలేఖ్య హాజరయ్యారు. ఇకపోతే హిమాన్షుకు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్‌లోనూ సీఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు రావడం చెప్పుకోదగిన విషయం. 2023ోల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హిమాన్షు.. పెన్సిల్వేనియా పిట్స్‌బర్గ్‌లోని కార్నిగీ మెల్లాన్ యూనివర్శిటీలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నాడు.
Also Read : KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు