Harsha Richhariya - A Kumbhfluencer : మహా కుంభమేళా 2025 అత్యంత సంబరంగా సాగుతోంది. జనవరి 13న ఈ వేడుక ప్రారంభం కాగా ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. రోజూ కోట్లాది మంది భక్తులు, సాధువులు, అఘోరాలు ప్రయాగ్ రాజ్ ని సందర్శించి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సమయంలో పలువురు ప్రత్యేకమైన బాబాలు, సాధువులు వైరల్ అవుతున్నారు. చోటా బాబా, ఐఐటీ బాబా, అంబాసిడర్ బాబా అంటూ పలువురు ఇప్పటికే నెటిజన్ల దృష్టిని సైతం ఆకర్షించారు. ఇప్పుడు మరో సాధువు వైరల్ అవుతున్నారు. కానీ అందరూ అనుకుంటున్నట్టు పురుషుడు కాదు.. మహిళ. ఉత్తరాఖండ్‌కు చెందిన హర్ష రిచారియా అనే సాధ్వీ ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోన్న ఆమెను ఇప్పుడు బ్యూటీఫుల్ సాధ్వీ, వైరల్ సాధ్వీ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. ఆమె నిరంజని అఖారా నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్, శిష్యురాలు అని, ఆధ్యాత్మికతలోని కొన్ని అంశాలను అనుసరిస్తున్నానని రిచారియా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మహా కుంభమేళాలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఏకైక సన్యాసులు, సాధువుల కథనాలతో సోషల్ మీడియా సందడి చేస్తోంది. ఈ తరుణంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తోన్న ఉత్తరాఖండ్‌కు చెందిన యువతి హర్ష రిచారియా.. సంప్రదాయ వస్త్రధారణతో, రుద్రాక్ష జపమాల, నుదుటిపై తిలకంతో అలంకరించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో, ఆమె యువ సాధ్విగా వైరల్ అవడంతో.. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ ప్రత్యక్షమయ్యాయి. అయితే హర్ష రిచారియా ఎవరు, తన ఆధ్యాత్మిక పరివర్తనకు దారితీసిన కారణాలేమిటి అన్న విషయాలను పరిశీలిస్తే..
ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం, రిచారియా రెండు సంవత్సరాల క్రితం సుకూన్ లేదా అంతర్గత శాంతి కోసం యాంకరింగ్, నటన, మోడలింగ్ కెరీర్ నుండి ఆధ్యాత్మికతకు మారారు. "ఈ కొత్త గుర్తింపును స్వీకరించడానికి నేను అన్నీ విడిచిపెట్టాను" అని ఆమె చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె నిరంజనీ అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరి జీ మహారాజ్ శిష్యురాలుగా ఉంది. అయితే ఆమె రీసెంట్ గా మహా కుంభమేళాలో కనిపించడంతో పలువురు ఆమెను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆమె సన్యాసి అయినట్టయితే కుంభమేళాలో ఇంత ఆడంబరం, ప్రదర్శన, మేకప్ ఎందుకు.. ? అని ప్రశ్నిస్తున్నారు.
హర్ష రిచారియా సాధ్వి కాదా.. ?
కొంతమంది ఆమె మునుపటి వీడియోను షేర్ చేస్తూ.. అసలు ఆమె సాధ్వీనే కాదని, ఫేక్ అని ఆరోపించారు. ఆ వీడియోలో రిచారియా.. తాను నిజమైన సన్యాసిని కాదని, ఎప్పుడూ వారిలో ఒకరిగా చెప్పుకోలేదని అన్నారు. వాస్తవానికి, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఆధ్యాత్మికతలోని కొన్ని అంశాలను స్వీకరించిన మాజీ నటి. తానెప్పుడూ సాధ్వి అని చెప్పుకోలేదని, ఇప్పుడు కూడా సాధ్విని కానని, తాను కేవలం మంత్ర దీక్ష మాత్రమే తీసుకున్నానని పదే పదే స్పష్టం చేస్తున్నానని ఆమె వివరించారు.
ఇకపోతే రిచారియా ఒక ఇన్ స్ట్రాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నాయి. ఆమె చాలా పోస్ట్‌లు సనాతం ధర్మం, యువశక్తి, అయోధ్య దేవాలయాలపై ఉండడం విశేషం. వీటిని చూసిన కొందరు నెటిజన్లు ఈ హర్ష రిచారియా ప్రొఫెషనల్ మోడల్ & యాంకర్. సాధ్వి కాదు అని ఆరోపించారు.
Also Read : Mahakumbh 2025: మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం