ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని కృష్ణా ట్రిబ్యునల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌కుమార్‌ వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు జరుపుతూ 2022లో తెలంగాణ జారీ చేసిన జీవో నెం.246ను సవాలు చేస్తూ ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌పై శుక్రవారం ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 విచారణ నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులను జరపబోమని, ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే నిర్దిష్ట కేటాయింపులు జరగని పక్షంలో ఆ మేరకు కేటాయింపులు మాత్రమే చేస్తామని బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌-2 మరోసారి స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ) 1956లోని సెక్షన్ - 3, 5 కింద కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్‌ ఇప్పటికే ముగించిందని తెలిపింది.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో 246 చట్ట విరుద్ధమని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు వాద‌న‌లు వినిపించింది. నీటి లభ్యత ఉన్నందునే డీపీఆర్‌ ఆమోదానికి జీవో జారీ చేశామని తెలంగాణ వాదించింది. ఏపీ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 ముందు రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. ట్రిబ్యునల్‌ ఇప్పుడు నదీ జలాల కేటాయింపులు చేయదని, కేటాయింపులు పూర్తికాని పక్షంలోనే ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేస్తుందని స్పష్టం చేసింది. 


మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల తరలింపులకు బదులుగా మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి పథకానికి తెలంగాణ కేటాయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని ఏపీ న్యాయవాది జయదీప్‌ గుప్తా వాదనలు వినిపించగా, నీటి కేటాయింపులపై నిర్ణయాధికారం తమకు లేదని బ్రిజేష్ కుమార్‌ ఆయన వాదనలను తోసిపుచ్చారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు నిర్ణయాధికారం లేదని, కేవలం మధ్యవర్తి పాత్రపోషించాల్సి ఉంటుందని పున ర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89ను ఉటంకిస్తూ ఏపీ న్యాయవాది పేర్కొనగా, అపెక్స్‌ కౌన్సిల్‌ విషయాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయవచ్చు అని బ్రిజేష్ తెలిపారు. ప్రాజెక్టుల వారీగా  కేటాయింపులు జరపనిపక్షంలో ఆపరేషనల్‌ ప్రొటోకాల్స్‌పై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదంటూ తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న చేతన్‌ పండిత్‌ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 


అయితే గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించిన 45 టీఎంసీల నీటిని పంచుకునేందుకు సరైన యంత్రాంగం అవసరమని ఏపీ వాదించింది. తెలంగాణ 89.15 టీఎంసీలను కాకుండా 175 టీఎంసీలను వినియోగిస్తోందంటూ మిషన్‌ కాకతీయ ఉత్తర్వులను ఉదహరించింది. తెలంగాణ ఏపీఆర్‌ఏ చట్టం, అపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీలకు పాలమూరు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించలేదని పేర్కొంది. దీనికి స్పందించిన తెలంగాణ సీనియర్‌ న్యాయవాది.. ఇప్పటికే డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీకి తెలంగాణ సమర్పించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు పొందేందుకే నీటి లభ్యతను చూపాల్సి వచ్చిందా? అంటూ ఈ సందర్భంగా ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు పొందాలంటే సీడబ్ల్యూసీ నుంచి నీటి లభ్యత ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉన్నందువ‌ల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీవో-246 జారీ చేసిందని తెలంగాణ త‌ర‌పు న్యాయ‌వాది వివ‌రించారు. కాగా.. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, జి.ఉమాపతి, తెలంగాణ తరఫున సీఎస్‌ వైద్యనాథన్‌, రామకృష్ణారెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న‌ అనంతరం విచారణను వచ్చే నెల 12, 13 తేదీలకు ట్రిబ్యునల్‌ వాయిదా వేసింది.