కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం ఇవాళ దిల్లీలో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి.. ఇరు బోర్డుల ఛైర్మన్లతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వస్తున్నందున కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం దిల్లీలో జరిగే ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లను కోరింది. నోటిఫికేషన్ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని తెలుగు రాష్ట్రాలు పట్టుపడుతున్న నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అత్యవసరంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆ గడువులోగా సాధ్యం కాదు
ఈ గెజిట్ అక్టోబరు 14 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని తెలిపింది. లేకపోతే ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని గెజిట్ లో పేర్కొంది. దీంతో సెప్టెంబరు ఒకటిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించాయి. గెజిట్‌లో పేర్కొన్న సమయానికి అనుమతులు పొందడం సాధ్యం కాదని, దశలవారీగా అమలుచేయాలని రెండు రాష్ట్రాలు బోర్డులకు తెలిపాయి. రెండు నెలల్లోగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున డిపాజిట్ చేయడం సాధ్యంకాదని ఇరు రాష్ట్రాలు పేర్కొన్నాయి. 15 రోజులకోసారి అవసరాలకు తగ్గట్లుగా విడుదల చేస్తామని తెలిపాయి.
తెలంగాణ అభ్యంతరం
ఈ సమావేశం అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఏపీ లేఖ రాసింది. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని తెలిపింది. ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాలువలు, ప్రాజెక్టులు అవసరం లేదని తెలిపింది. సీఎం కేసీఆర్ ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గోదావరిలో అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చడం, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి అనుమతి లేదని పేర్కొనడంపై చర్చించారు. వీటన్నింటిపై ఈ నెల 10న కేంద్రజల్‌శక్తి కార్యదర్శి దిల్లీలో సమావేశం నిర్వహించారు. దీనికి అనుగుణంగా ఇవాళ బోర్డు ఛైర్మన్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.
Also Read: Old Note: అబ్బా లక్కీ ఛాన్స్.. ఈ పది రూపాయలుంటే రూ.5 లక్షలు మీవే.. ఇక జేబులో వేసుకోవచ్చు