బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఆదివారం సాయంత్రం వాయుగుండంగా మారిందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రం వాయుగుండంగా మారింది. సోమవారం ఒడిశాలోని చాంద్‌బలి సమీపంలో వాయుగుండం తీరం దాటనుందని వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో వర్షాలు
తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాలో తేలికపాటి జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలింపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం వుందని, కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
తెలంగాణలో వర్షాలు
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీచేశారు. దీంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతోంది.
గోదావరి ఉద్ధృతి
గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. వరద నీరు భారీగా చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.