దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతులు మరోసారి తమ నిరసన వ్యక్తంచేయనున్నారు. ఈ రోజు జరిగే రైతు ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలిరానున్న లక్షల మంది రైతులతో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించనున్నట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు ఆదివారం వెల్లడించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పలు రైతు సంఘాల సమాఖ్యగా ఏర్పడిన ఎస్‌కేఎం ఇప్పటికే ప్రకటించింది. కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ మీడియాతో మట్లాడుతూ..2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం మాకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో వివిధ రాష్ట్రాల నుంచి రైతులు ‘కిసాన్ మహా పంచాయత్’ లో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకుంటున్నారు.
కాగా ఆదివారం నిరుద్యోగులు ఉపాధి కోసం నిర్వహించిన ఆందోళనలో పాల్గొనేందుకు బికెయు నేత రాకేష్ తికాయత్ వస్తుండగా ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మధువిహార్ పోలీస్ స్టేషన్‌కు నిరుద్యోగుల ఆందోళన ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం ఆయననను విడిచిపెట్టారు. ప్రజా ఉద్యమాలను పోలీసులు అణిచివేయలేరని తికాయత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మల్లా ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అన్నదాతల పక్షాన తమ పోరాటం చివరి శ్వాస వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. తికాయత్ అరెస్టును ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ రారు ఖండించారు.
మరోవైపు.. ‘కిసాన్ మహా పంచాయత్’ నేపథ్యంలో ఢిల్లీలోని మహారాజా రంజీత్ సింగ్ మార్గ్, మిర్దార్డ్ చౌక్, ఢిల్లీ గేట్, JLN మార్గ్, మింటో రోడ్, కమలా మార్కెట్, హమ్దార్ద్ చౌక్, అజ్మారీ గేట్, భవభూతి మార్గ్, చమన్ లాల్ మార్గ్, పహర్‌గంజ్ చౌక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బరాఖంభా రోడ్ నుండి గురునానక్ చౌక్ వరకు, మింటో రోడ్ నుంచి కమలా మార్కెట్ వరకు రంజీత్ సింగ్ ఫ్లైఓవర్. , వివేకానంద మార్గ్, JLN మార్గ్ (ఢిల్లీ గేట్ నుంచి గురునానక్ చౌక్), కమలా మార్కెట్ నుంచి గురునానక్ చౌక్, చమన్ లాల్ మార్గ్., అసఫ్ అలీ రోడ్ వైపు అజ్మేరీ గేట్, పహర్‌గజ్ చౌక్, జందేవాలన్, దేశ్ బంధు గుప్తా రోడ్ నుంచి అజ్మేరీ గేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.