Kisan Mahapanchayat: 


నిరుద్యోగం, కనీస మద్దతు ధర డిమాండ్‌లు..


ఢిల్లీలో రైతులు నిరసనలు చేపడుతున్నారు. కనీస మద్దతు ధర, నిరుద్యోగం లాంటి సమస్యలపై కేంద్రానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు చేపడుతున్నారు. ఫలితంగా..ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ బార్డర్‌కు సమీపంలోని ఘజియా పూర్‌లో నిరసనలో పాల్గొన్న రైతులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంయుక్త కిసాన్ మోర్చ (SKM) ఇచ్చిన "మహాపంచాయత్" పిలుపు మేరకు వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్‌మంతర్‌కు చేరుకుంటున్న రైతులను ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. "మహాపంచాయత్ నిరసన కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా నిర్వహించాలనుకున్నాం. కనీస మద్దతు ధర, విద్యుత్ సవరణ బిల్లు రద్దు లాంటి సమస్యలపైనే మా పోరాటం" అని ఎస్‌కేఎమ్ సభ్యుడు ఒకరు తెలిపారు. తాము ఉద్యమం చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చిందని, వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని రైతులు మండి పడుతున్నారు. అందుకే మరోసారి నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని, ఇక్కడి నుంచే తమ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని చెబుతున్నారు. అటు సంయుక్త రోజ్‌గార్ ఆందోళన్ సమితి (SRAS)కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. రోజ్‌గార్ సన్సద్‌ పేరిట ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.









 


టికాయత్ అరెస్ట్..


75 గంటల పాటు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి వద్ద బైఠాయిస్తామని సంయుక్త్ కిసాన్ మోర్చ ఆగస్టు 18వ తేదీనే వెల్లడించింది. ఈ నిరసనలో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు రైతులు పాల్గొన్నారు. ఢిల్లీ-హరియాణా బార్డర్‌లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రాకేశ్ టికాయత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.