North Korea Floods: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కొరియా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...30 మంది అధికారులను ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఉత్తర కొరియాలో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా దాదాపు  వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే...ఈ సమయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ప్రాణనష్టం భారీగా నమోదవడానికి కారణమయ్యారని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆ 30 మందినీ ఉరి తీయాలని ఆర్డర్ పాస్ చేసినట్టు సౌత్ కొరియా మీడియా స్పష్టం చేసింది. 


గత నెలలోనే వీళ్లందరినీ ఉరి తీసినట్టు సమాచారం. అయితే...ఆయా అధికారుల వివరాలు మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు. చాలా సీక్రెట్‌గా ఈ పని కానిచ్చేసినట్టు సౌత్ కొరియా మీడియా వెల్లడించింది. 2019 నుంచి కిమ్‌కి సన్నిహితంగా ఉంటూ పని చేస్తున్న వాళ్లనీ లెక్కచేయకుండా కఠిన శిక్షలు వేస్తున్నాడు. ఈ ఏడాది జులైలో ఉత్తర కొరియాని ప్రకృతి విపత్తు కుదిపేసింది. భారీ వరదల కారణంగా 4 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో కిమ్‌ జాంగ్ ఉన్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశారు. 


వరదల కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేశారు కిమ్. ఇళ్లన్నీ పునర్నిర్మించేందుకు ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేమని అన్నారు. ప్యోగ్యాంగ్‌లో తాత్కాలికంగా వరద బాధితులకు షెల్టర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ 15 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. వీళ్లలో గర్భిణులు, చిన్నారులున్నారు. అయితే...వరదల కారణంగా వెయ్యి మంది చనిపోయారన్న వార్తల్ని కిమ్ కొట్టి పారేస్తున్నారు. ఇదంతా విషప్రచారం అని మండి పడుతున్నారు. సౌత్ కొరియా పనిగట్టుకుని మరీ ఈ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా నార్త్ కొరియా ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర జరుగుతోందని ఫైర్ అయ్యారు. నిజానికి కొవిడ్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచే ఉత్తర కొరియాలో అధికారులను ఉరి తీస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 


సరిగ్గా పని చేయకపోతే నేరుగా ఉరిశిక్ష విధిస్తున్నారు. కొవిడ్ రాక ముందు ఏటా 10 మందిని ఉరి తీసేవాళ్లు. ఆ తరవాత ఈ సంఖ్య ఏకంగా 100 దాటిందని కొరియా టైమ్స్ వెల్లడించింది. వింతవింత ఆంక్షలు, నిబంధనలతో ఎప్పుడూ కిమ్ వార్తల్లో ఉంటారు. పోనీ టెయిల్స్ వేసుకున్నా, పొట్టి బట్టలు ధరించినా జైలుశిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా జైలు కూడు తప్పదు. ఈ శిక్షలపైనే తరచూ సౌత్ కొరియా మండి పడుతూ ఉంటుంది. అనాగరికం అని విమర్శిస్తోంది. కిమ్ మాత్రం ఈ విమర్శలని పట్టించుకోకుండా దూసుకుపోతున్నారు. 


Also Read: Vinesh Phogat: వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా పొలిటికల్ ఎంట్రీ - ఈ ఒక్క ఫొటోతో కన్‌ఫమ్ అయినట్టేనా?