Kidney Problems: ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో చీమలపాడు హరిజనవాడ పెద్ద తండా, చైతన్య నగర్ తండాల్లో కిడ్నీ బాదితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బాధితులు పెరుగుతుండటంతో స్దానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. కిడ్నీ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ విపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అయినా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమర్శలు గుప్పిస్తున్నారు. 


అప్పుడు హామీ ఇచ్చారు ఇప్పుడు పట్టించుకోరా..


ఎన్నిక‌ల వాగ్ధానాలు అమ‌లు కాని వైనంపై స్దానిక నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పింఛన్లు, ప్రభుత్వ సహాయం అంద‌క ఆస్తులు అమ్మ‌కుంటున్నామ‌ని బాధితులు ఆవేద‌న చెందుతున్నారు. క‌నీసం మంచి నీరు, మందులు కూడా పంపిణీ చేయ‌టం లేద‌ని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.


ఏకొండూరులో పర్యటించిన నాయకులు..


కిడ్నీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై.. సీపీఎం నాయ‌కుల బృందం ఏకొండురూలో పర్య‌టించింది. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని సీపీఎం డిమాండ్ చేసింది. ఎన్‌.టి.ఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధుల వరుస మరణాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సి.పి.ఎం. బృందం బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది.


బాధితులను పరామర్శించిన నేతలు..


ఏకొండూరు మండలంలో చీమలపాడు హరిజన వాడ పెద్ద తండా, చైతన్య నగర్ తండాలలో పర్యటించి కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై నాయకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వారిలో సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 


బాధితులను పట్టించుకోరా?


ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల వలన వరుస మరణాలు చోటు చేసుకుంటున్నా విషయాన్ని సిపిఎం పార్టీ ఆందోళనలు నిర్వహించి వెలుగులోకి తెచ్చిందని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం గర్హనీయమని సీపీఎం నేతలు అన్నారు. 2022వ సంవత్సరంలో ఇప్పటి వరకు 20 మంది వరకు కిడ్నీ వ్యాధుల వలన మృతి చెందారని అంతకుముందు ఇక్కడ సంభవించిన మరణాలు లెక్కకు మించి ఉన్నాయని అన్నారు. తాము పర్యటించిన గ్రామాల్లో గిరిజన తండాలలో ఇంటికి ఒకరు చొప్పున కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారని గత ప్రభుత్వం కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులను గాలికి వదిలేసిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా కిడ్నీ వ్యాధి గ్రస్తుల సమస్యలు పట్టించుకోవడంలేదని విమ‌ర్శించారు.


ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు?


ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నీ వ్యాధుల విషయమై ఆరోగ్య శాఖ అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని సీపీఎం నేతలు అన్నారు. ఇది బాధ్యతా రాహిత్యమేనని వారు విమర్శించారు. కిడ్నీ బాధితులు మంచాలలో ఉండి డయాలసిస్ చేయించుకునే వారు డబ్బుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి సాయం అందడం లేదని ఆరోపించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను వారి వద్దకు వెళ్లి వింటుంటే హృదయం ద్రవించుకుపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


కనీసం ఆరోగ్యశ్రీ  అందించండి..


బాధితులు డయాలసిస్ కోసం ఆస్పత్రులకు వెళితే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వాగ్దానం చేసిన సీఎం.. ఆ విషయాన్ని మర్చిపోయారని అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని సీపీఎం నేతలు విమర్శించారు. మండలంలో ఇప్పటి వరకు కిడ్నీ వ్యాధులతో మరణించిన వారి వివరాలను ప్రభుత్వం సేకరించి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


సర్కారు స్పందించకుంటే ఉద్యమమే..


కిడ్నీ బాధితుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని సీపీఎం నాయకులు హెచ్చరించారు. మండలంలో నానాటికి కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయని ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. చీమలపాడు పెద్ద తండాకు చెందిన రాంబాబు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 73 సార్లు డయాలసిస్ చేయించుకున్నా.. ఇప్పటి వరకు ఆ బాధితుడికి పెన్షన్ మంజూరు కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని మండల పరిషత్ ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారని ఇది కిడ్నీ రోగుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు అన్నారు. జిల్లా కలెక్టరు దృష్టికి కూడా తీసుకువెళ్ళారన్నారు. కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఏకొండూరు మండల ప్రజానీకానికి తాగు నీటి కొరకు ఇప్పటివరకు కృష్ణా జలాలను సరఫరా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.