Kerala Train Attack Case: కేర‌ళ‌లో అలప్పుజా - కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌లో తోటి ప్ర‌యాణికుల‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరి జిల్లాలో ప‌ట్టుబ‌డ్డాడు. కేంద్ర నిఘా బృందం, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) సంయుక్తంగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో నిందితుడు, ఢిల్లీలోని ష‌హీన్‌బాగ్‌కు చెందిన షారుక్ సైఫీని అదుపులోకి తీసుకున్నాయి. అనంత‌రం రత్నగిరికి చేరుకున్న కేరళ పోలీసుల బృందానికి అతన్ని అప్పగించాయి.

ఆదివారం రాత్రి దాడిలో ముఖం, త‌ల‌కు గాయాలు కావ‌డంతో మహారాష్ట్రలోని రత్నగిరికి చేరుకున్న నిందితుడు అక్కడ ఒక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. బుధవారం పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడని ఏటీఎస్‌ అధికారి వెల్లడించారు. నేరానికి పాల్పడింది తానేనని షారుఖ్‌ సైఫీ అంగీకరించాడని, అందుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.

కోజికోడ్‌లోని ఎలత్తూర్ సమీపంలో అలప్పుజా - కన్నూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 16307) డీ1 కంపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పెట్రోల్‌ చల్లి పలువురు ప్రయాణికులకు నిప్పంటించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో మంటల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలు నుంచి దూకి ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, తొమ్మిది మంది ప్రయాణికులు గాయ‌ప‌డ్డారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మలప్పురం క్రైం బ్రాంచ్ ఎస్పీ పి.విక్రమన్ నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఘ‌ట‌నా స్థలంలో ల‌భించిన బ్యాగ్‌లో దొరికిన నోట్‌బుక్‌లో ఎలాంటి వివ‌రాలు లేనప్పటికీ, సిమ్ కార్డులేని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించిన‌ప్పుడు నిందితుడి గుర్తింపుపై పోలీసులకు కీలకమైన ఆధారాలు ల‌భించాయి. నోట్‌బుక్‌లో కేరళలోని అనేక ప్రాంతాల పేర్లను ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఆ బ్యాగ్‌లో పెట్రోల్ లాంటి ద్రవం, దుస్తులు, లంచ్ బాక్స్, కళ్లజోడు కూడా ఉన్నాయి.

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి రైల్వేమంత్రి కృత‌జ్ఞ‌త‌లు

కేర‌ళ‌లో క‌దులుతున్న తోటి ప్ర‌యాణికుల‌కు నిప్పుపెట్టిన నిందితుడు మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరిలో ప‌ట్టుబ‌డ్డాడ‌ని రైల్వేమంత్రి అశ్విని వైష్ణ‌వ్ బుధ‌వారం తెలిపారు. అమాన‌వీయ దాడికి పాల్ప‌డిన నిందితుడు మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరిలో ప‌ట్టుబ‌డ్డాడు. అత‌న్ని ఇంత త్వ‌ర‌గా అరెస్ట్ చేసిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసుల‌కు  ఆర్పీఎఫ్‌, ఎన్ఐఏల‌కు నా ధ‌న్య‌వాదాలు అని ఆయ‌న పేర్కొన్నారు.







కాగా.. కేర‌ళ పోలీసులు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక బృందాలు, కేంద్ర ద‌ర్యాప్తు బృందాలు, మ‌హారాష్ట్ర పోలీసుల సంయుక్త కృషితో నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని కేర‌ళ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ తిరువ‌నంత‌పురంలో మీడియాకు తెలిపారు. నిందితుడిని వీల‌యినంత త్వ‌ర‌లో రాష్ట్రానికి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న చెప్పారు.