AP Politics  :  ఆంధ్రప్రదేశ్‌లో జనసేన , బీజేపీ మధ్య పొత్తులు ఉన్నాయి. ఇది అధికారికం. కానీ కలిసి పని చేయడం లేదు. మీరు కలసి రావడం లేదంటే మీరు కలసి రావడం లేదని రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక తర్వాత వచ్చిన అన్ని ఉపఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయాలని తాము ప్రతిపాదించామన కానీ పవన్ కల్యాణ్ అంగీకరించలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారశైలి తనకు అసలు నచ్చలేదని..  అసలు వారిని తాను పట్టించుకోవడంలేదన్నారు. కానీ బీజేపీ అగ్రనేతలకు తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. అందుకే ఏదైనా ఢిల్లీలో తేల్చుకుంటామనుకున్నారు. కానీ ఢిల్లీ వెళ్లిన పవన్‌కు రెండు రోజులు ఉన్నా ప్రధాని మోదీ కానీ..  హోంమంత్రి అమిత్ షా కానీ అపాయింట్‌మెంట్ ఇవవలేదు. దీంతో బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్‌తో చర్చలు జరిపి వచ్చేశారు. 


ఢిల్లీలో ఒక్క సారి కూడా పవన్ ను కలవని ప్రధాని మోదీ  ! 


బీజేపీ అగ్రనేతలు తనకు ఎంతో ఆప్తులని.. పవన్ కల్యాణ్ చాలా సార్లు చెప్పారు. నిజానికి వారు ఎప్పుడూ పవన్ కల్యాణ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన తర్వాత  2014లో అహ్మదాబాద్ వెళ్లి మోదీని కలిశారు పవన్ కల్యాణ్. అదే చివరి సారి. తర్వాత ఎన్నికల ప్రచారంలో.. ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు పవన్ ను కలిశారు కానీ.. ఢిల్లీకి వెళ్లినప్పుడు మాత్రం ఎప్పుడూ కలవలేదు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీనే పోటీ చేసేలా ఒప్పించేందుకు ఢిల్లీ పిలిపించినప్పుడు ఓ సారి అమిత్ షా మాట్లాడారు. అంతే తప్ప ఏపీ రాజకీయాలపై చర్చిద్దామని వచ్చిన ప్రతీ సారి పవన్ కు నిరాశే ఎదురయింది. 


స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవడం లేదని పవన్‌పై బీజేపీ హైకమాండ్ అసంతృప్తితో ఉందా  ?


జాతీయ నేతలు రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీతో అయినా పొత్తులు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక వ్యవహారాలన్నీ రాష్ట్ర స్థాయిలోనే ఉండాలని చూసుకుంటారు. రాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుని బలపడాలని అనుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ ఈ విషయంలో చొరవచూపలేదని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తిరుపతి ఉపఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయలేకపోయాయి. ఆ తర్వాత తాము బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామని కొంత మంది జనసేన నేతలు మీడియా ఎదుట విమర్శలు చేశారు. ఇలాంటి పరిణామాలపై హైకమాండ్‌కు నివేదికలు వెళ్లడంతో... పవన్ విషయంలో ప్రయారిటీ తగ్గించుకున్నట్లుగా చెబుతున్నారు. 


పవన్ కల్యాణ్ తమకు అంత దగ్గర కాదని సంకేతాలు పంపారా ?


పవన్ కల్యాణ్ ఎప్పుడూ అపాయింట్‌మెంట్లు అడగరు. మహా అయితే ఏడాదికోసారి అడుగుతారేమో. అదీ కూడా రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికే. తాను రిక్వెస్ట్ చేస్తే ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారన్న  నమ్మకంతో గతంలో  చేనేతల్ని ఢిల్లీకి తీసుకెళ్తానని పవన్ మాటిచ్చారు. కానీ అపాయింట్ మెంట్ గగనం కావడంతో ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఢిల్లీకి వెళ్తే  బీజేపీలో టాప్ టు ఇద్దరూ అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడంతో.. రాష్ట్ర బీజేపీ నేతల్ని తక్కువ చేసి.. తమ దగ్గరకు వస్తే తాము ఎందుకు ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతాల్ని పంపినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. 


ఏపీ బీజేపీ నేతల్లోనూ ఓ స్పష్టత


పవన్ కల్యాణ్ , నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన సమయంలో ఏపీ బీజేపీ సోషల్ మీడియా టీం ఢిల్లీలోనే ఉంది.  పవన్ కంటే ముందే వారితో జేపీ నడ్డా  భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపైనా చర్చించారు. తర్వాత పవన్ తో నడ్డా  భేటీ అయ్యారు. ఈ రెండు సమావేశాల తర్వాత ఏపీ బీజేపీ నేతలకు ఓ క్లారిటీ వచ్చింది. అదేమిటన్నది స్పష్టంగా చెప్పకపోయినా...  తాము ఎవరినో ఓడించడానికి.. లేదో ఎవరినో గెలిపించడానికి రాజకీయాలు చేయడంలేదని.. తామే అధికారంలోకి రావాలనుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు. 


 





 



ఎలా చూసినా పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ హైకమాండ్ తమ అసలైన రాజకీయాన్ని ప్రారంభించిందని అంటున్నారు. అయితే పవన్ మాత్రం ఎటూ తేల్చుకోలేక స్పష్టంగా ఓ దారిని ఎంచుకోలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.