Business News in Telugu: జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు వస్తాయని కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. దీంతో పాటు జూన్‌ 1 నుంచి మరి కొన్ని కీలక మార్పులు రానున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ల ధరలు మారనున్నాయి. అటు ఆధార్ కార్డ్‌ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వాళ్లూ త్వరపడాల్సిన అవసరముంది. ఈ నెలలోనే దీనికి సంబంధించిన ఆఖరి గడువు ముగిసిపోనుంది. ఇక ఇదే నెలలో బ్యాంక్‌ సెలవులూ అధికంగా ఉన్నాయి. మొత్తంగా జూన్‌ నెల అందరికీ కీలకంగా మారనుంది. 


కొత్త లైసెన్స్ రూల్స్..


డ్రైవింగ్‌ లైసెన్స్‌ రూల్స్ విషయానికొస్తే..రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ రూల్స్‌ కచ్చితంగా పాటించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్‌లో మార్పులు (New Driving License Rules) చేర్పులు చేసింది. ఇకపై లైసెన్స్‌ల కోసం RTO చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్‌లోనే లైసెన్స్ పొందేలా నిబంధనను చేర్చింది. అర్హత ఉన్న ట్రైనింగ్ సెంటర్‌లు టెస్ట్ నిర్వహించి లైసెన్స్‌లుజారీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దాదాపు 9 లక్షల మేర కాలం చెల్లిన ప్రభుత్వ వాహనాలను స్క్రాప్‌గా మార్చనున్నారు. కర్బన ఉద్గారాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఓవర్‌ స్పీడ్‌కి రూ.1000-2000 ఫైన్ విధించనున్నారు. ఒకవేళ మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే పోలీసులు రూ.25 వేల జరిమానా విధిస్తారు. పోర్షే కార్ యాక్సిడెంట్ కేసు తరవాత మైనర్ డ్రైవింగ్‌ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే భారీ జరిమానా విధించింది. అంతే కాదు. మైనర్‌ డ్రైవింగ్ చేస్తే పాతికేళ్లు వచ్చేంత వరకూ మళ్లీ డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అయితే...లైసెన్స్ ఇచ్చే డ్రైవింగ్ స్కూల్స్‌లో కనీసం ఎకరం స్థలం ఉండాలన్న కండీషన్ పెట్టింది కేంద్రం. ట్రైనింగ్‌లో ప్రాక్టికల్స్‌తో పాటు థియరీ కూడా చెప్పాలని తేల్చి చెప్పింది. 


పెట్రో, గ్యాస్ ధరలు - ఆధార్ అప్‌డేట్‌ 


సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు మారుస్తుంటాయి కంపెనీలు. అదే విధంగా జూన్ 1వ తేదీన కూడా సంస్థలు గ్యాస్ సిలిండర్‌ల ధరలు మార్చనున్నాయి. మే నెలలో వాణిజ్య సిలిండర్‌ ధరలు తగ్గించాయి. జూన్‌లోనూ ఇదే విధంగా తగ్గింపు కొనసాగే అవకాశాలున్నాయి. అటు పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ మార్పులు రానున్నాయి. ఇక ఆధార్ కార్డ్‌ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి జూన్ 14వతేదీన ఆఖరి గడువుగా విధించింది కేంద్రం. ఆన్‌లైన్‌లోనే కార్డులో మార్పులు చేసేందుకు అవకాశమిచ్చింది. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.


10 రోజులు బ్యాంక్‌ సెలవులు..


RBI ఇచ్చిన లిస్ట్ ప్రకారం జూన్‌లో దాదాపు 10 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులున్నాయి. వీటిలో ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారాలూ ఉన్నాయి. ఇవి కాకుండా రాజా సంక్రాంతి, ఈద్ ఉల్ అదా రోజుల్లో సెలవులు డిక్లేర్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్‌ పనులున్న వాళ్లు ఆయా తేదీల్ని గుర్తు పెట్టుకోవాలి. 


Also Read: Chicken Slaughtering: 40 లక్షల కోళ్లను ఒకేసారి చంపనున్న రైతులు, కారణమిదే