Kerala Train Fire: కేరళలో దారుణ ఘటన జరిగింది. రైలు ప్రయాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్రహించిన ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళ సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు వ్యాపించడంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో కోజికోడ్ రైల్వే స్టేషన్ (ఉత్తరం) నుంచి అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఎలత్తూరు, కోయిలాండి రైల్వే స్టేషన్ల మధ్య కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బయలుదేరిన కొద్దిసేపటికే డి-1 కోచ్‌లో వివాదం తలెత్తి ఆగ్రహానికి గురైన గుర్తు తెలియని వ్యక్తి సహ ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ముగ్గురు మరణించారని పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఉగ్రవాద దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవని వెల్లడించారు.
రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిలవడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన నిందితుడు.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ చిన్నారి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురూ మరణించారు. రైలు పట్టాలపై నుంచి పసిపాపతో సహా మూడు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతుల్లో ఇద్దరిని తౌఫిక్, రెహానాగా గుర్తించారు. మంటలు వ్యాపించడంతో కదులుతున్న రైలులో నుంచి వారు భయంతో దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టాల నుంచి మరో బాటిల్ పెట్రోల్, రెండు మొబైల్ ఫోన్‌లు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు.
మంటలు బోగీకి వ్యాపించడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలోని తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) బృందం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం కోరాపుజా నది వెంబడి ఉన్న వంతెనపై రైలు ఆగిన వెంటనే, ముప్పై ఏళ్ల వయస్సు గల వ్యక్తి దాని నుంచి దూకి తన కోసం వేచి ఉన్న బైక్‌పై పారిపోయాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. పరారైన నిందితుడు ఇతర వ్యక్తుల సహాయంతో బైక్‌పై వెళుతున్నట్టు సీసీ టీవీల్లో గుర్తించిన పోలీసులు ఆ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానిస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మండే స్వభావమున్న ద్రావణంతో ఉన్న బాటిల్‌ను తీసి సహ ప్రయాణికులపై చల్లాడని, వారు స్పందించేలోపే నిప్పంటించి పారిపోయాడని గాయపడిన వారిలో ఒకరు పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో మహిళ, ఓ చిన్నారి కనిపించకుండా పోయినట్లు గాయపడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు.