Kerala Governor Vs SFI: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనూహ్యంగా ప్రవర్తించి అధికారులను పరుగులు పెట్టించారు. కొల్లం జిల్లాలో ఆయన కాన్వాయ్‌ని Student Federation of India (SFI) విద్యార్థులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన గవర్నర్ వెంటనే కార్ దిగి రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు వైపు వెళ్లారు. అక్కడే కుర్చీ వేసుకుని ేకూర్చున్నారు. తన కాన్వాయ్‌కి అడ్డం వచ్చిన ఆ విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆయన ఓ కార్యక్రమానికి వెళ్తుండగా SFI విద్యార్థులు ఇలా అడ్డగించారు. అధికార CPM పార్టీకి అనుబంధ సంస్థ అయిన SFIపై గవర్నర్ అంత అసహనం వ్యక్తం చేయడానికి కారణముంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిస్తున్న బిల్స్‌ని గవర్నర్ ఆమోదించడం లేదు. ఈ సమస్యతో పాటు యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఈ క్రమంలోనే ఈ ఘటన జరగడం సంచలనమైంది. అయితే..ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గవర్నర్‌కి Z Plus సెక్యూరిటీ కల్పిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాజ్‌భవన్ వద్దా ఈ భద్రత కల్పించింది.
పోలీసులతో వాదన..
విద్యార్థులు కాన్వాయ్‌ని అడ్డగించినప్పుడు పోలీసులు వెంటనే స్పందించారు. వాళ్లందరినీ అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ తరవాత అంతా క్లియర్ అయిపోయిందనుకుంటున్న సమయంలో గవర్నర్ ఉన్నట్టుంది కార్ దిగారు. నేరుగా వెళ్లి కుర్చీలో కూర్చుని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. వాళ్లను అరెస్ట్ చేస్తారా లేదా అంటూ వాదించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ వాగ్వాదం కొనసాగింది. SFI విద్యార్థులపై FIR నమోదు చేసి ఆ కాపీని చూపిస్తే తప్పించి అక్కడి నుంచి కదలనని భీష్మించుకు కూర్చున్నారు. ఫలితంగా అధికారులంతా తలలు పట్టుకున్నారు. మొత్తానికి పోలీసులు ఆ నిరసనకారులపై FIR నమోదు చేసి ఆ కాపీలను గవర్నర్‌కి చూపించారు. అసలు ఈ గొడవంతటికి కారణం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటూ మండి పడ్డారు ఆరిఫ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. SFI ఆందోళనకారులకు భద్రత కల్పించాలని ప్రభుత్వమే పోలీసులకు ఆదేశాలిచ్చిందని ఆరోపించారు.