బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీఎం కుటుంబం హస్తం-నిందితురాలి ఆరోపణ
గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను వీడని నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే త్రిక్కకర ఉప ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బాధలో ఉన్నారు విజయన్. తదుపరి ఎన్నికల్లోనూ విజయం తమదే అనుకుంటున్న తరుణంలో ఇలా ఓడిపోవటం ఆయన ఆత్మస్థైర్యాన్ని కాస్త దెబ్బ తీసింది. ఎల్‌డీఎఫ్‌ చేసిన అభివృద్ధి పనులే మరోసారి విజయపతాకం ఎగరేస్తాయని నమ్మినప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పినరయి విజయన్. ఈ దెబ్బతోనే డీలా పడిపోగా ఇప్పుడు మరో సవాలు ఎదురైంది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ సీఎం పినరయి విజయన్‌పై చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. 



బిర్యానీ పాత్రలో బంగారం స్మగ్లింగ్..!
సీఎం పినరయి విజయన్‌తో పాటు ఆయన భార్య, కుమార్తె, ఇద్దరు సహాయకులకు ఈ కేసుకి సంబంధం ఉందని ఆరోపించారు స్వప్నా సురేశ్. ఈ అక్రమ రవాణాలో వీరందరూ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. స్థానిక మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు స్వప్న. భార్య కమలా విజయన్, కుమార్తె వీణా విజయన్ సహా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నళిని నెట్టో, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జలీల్, 
సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్‌కు ఈ అక్రమ రవాణాకు ప్రత్యక్ష సంబంధం ఉందన్నది ఆమె చేస్తున్న ప్రధాన ఆరోపణ. రాష్ట్రంలో యూఏఈ దౌత్య కార్యాలయం నుంచి సీఎం అధికారిక నివాసానికి బంగారం అక్రమ రవాణా జరిగిందని అంటున్నారు స్వప్న. బిర్యానీ వండుకునే పాత్రలో బంగారాన్ని దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేయాలని భావించినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. 


బంగారం స్మగ్లింగ్ ఎప్పుడు జరిగింది..? 
2020 జులైలో రాష్ట్రంలోని యూఏఈ దౌత్యకార్యాలయానికి చెందిన పార్సిల్‌లో 15కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవటం రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేపింది. రాజకీయంగా తీవ్ర స్థాయిలో వేడి రాజుకోవటం వల్ల పోలీసులు వెంటనే స్పందించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న యూఏఈ కార్యాలయ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఐటీ శాఖలోని ఓ మహిళా ఉద్యోగినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు వెల్లువెత్తగా...పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఈ కేసు సీఎం పినరయి విజయన్‌ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. అయితే ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. తమ కుటుంబంపై అనవసరంగా బురద జల్లుతున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పినరయి విజయన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రానికి "బ్లాక్‌డే" అంటూ నినదిస్తున్నాయి. ఏ ఆధారాల్లేకుండా వాంగ్మూలం ఎలా ఇస్తానని, మరికొన్ని రోజులు ఆగితే పూర్తి వివరాలు బయటపెడతానని  స్వప్నా సురేష్ అంటుండాన్ని బట్టి చూస్తే ఈ కేసు ఇంకెన్నో మలుపులు తీసుకోనుందని స్పష్టమవుతోంది.