Thiruvananthapuram:
విద్యార్థుల అతి భరించలేకే..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే నిరసనలు కొన్ని ఆలోచింప చేస్తే, మరి కొన్ని నవ్వు తెప్పిస్తాయి. కొందరు కావాలనే వెరైటీగా నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కేరళలో కొందరు స్టూడెంట్స్ ఇలానే చేశారు. తిరువనంతపురంలోని ఓ బస్‌స్టాప్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఉద్దేశంతో స్టీల్ బెంచ్‌ను తీసేశారు. మధ్యలో గ్యాప్ ఇస్తూ మూడు కుర్చీలు మాత్రమే వేశారు. సాధారణంగా అయితే ఈ బస్‌స్టాప్ స్టూడెంట్స్‌కి అడ్డా. అందరూ ఇక్కడికే వచ్చి హ్యాంగౌట్ చేస్తుంటారు. ఇది కాస్త మితిమీరటం వల్ల స్థానికులు ఇబ్బంది పడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ తెగ ఎంజాయ్ చేస్తారు. కొందరు వీరిపై పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే బస్‌స్టాప్‌లోనే లాంగ్ స్టీల్ బెంచ్‌ను తొలగించటం విద్యార్థులను షాక్‌కు గురి చేసింది. వెంటనే వారికో ఫన్నీ ఐడియా వచ్చింది. ఒకే కుర్చీలో ఇద్దరు కూర్చుని ఫోటోలు దిగారు. అబ్బాయిలు కుర్చీలో కూర్చుంటే వాళ్ల ఒడిలో అమ్మాయిలు కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుంచి ఇవి వైరల్ అవుతున్నాయి. కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుంటే మరి కొందరు "ఇదేం ఆటిట్యూడ్" అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త బస్‌స్టాప్ నిర్మిస్తాం: మేయర్
తిరువనంతపురం మేయర్ ఈ ఫోటోలను చూసి ఆ బస్‌స్టాప్‌కు వెళ్లారు. త్వరలోనే కొత్త బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. " స్థానిక అసోసియేషన్ వాళ్లు ఈ బస్‌స్టాప్ కట్టించారు. స్టూడెంట్స్ చాలా సేపు ఇక్కడే గడుపుతారు. కాకపోతే కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు మరీ సన్నిహితంగా ఉండటం ఇక్కడికి వచ్చి పోయే వాళ్లను ఇబ్బంది పెడుతోంది. కొందరు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. రాత్రి పూట ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటూ స్టూడెంట్స్‌ను ప్రశ్నించారు" అని ఓ వ్యక్తి చెప్పాడు. కేవలం సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ విద్యార్థులు మాత్రం తమపై కోపాన్ని ఇలా చూపించారని మండి పడుతున్నారు.
Also Read: Thank You Movie Review: ‘థాంక్యూ’ రివ్యూ - నాగ చైతన్య వన్ మ్యాన్ షో, ప్రేక్షకులు థాంక్స్ చెబుతారా?