తెలంగాణ రాజకీయ రాను రాను వేడేక్కుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యహాలకు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ,  బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ ఎస్సీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఇటీవలి కాలంలో పూర్తి స్థాయిలో దళిత ఎజెండానే రాజకీయ అస్త్రంగా మార్చుకున్న కేసీఆర్ పలు ప్రకటనలు చేస్తున్నారు. పథకాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో దళితుల రిజర్వేషన్ల పెంపును ప్రయత్నిద్దామని ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చినట్లయింది. 


ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీనే అడ్డు అన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు..!


తెలంగాణలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్లు 15శాతం ఉన్నాయి. సకల జనుల సర్వే ప్రకారం జనాభా 18శాతం ఉంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలనేది టీఆర్ఎస్ విధానం, కేసీఆర్ కూడా తరచూ అదే చెబుతూంటారు. గతంలో అసెంబ్లీలో దళితుల రిజర్వేషన్లు ఒక శాతం పెంచుతామని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పెంచుకునే ప్రయత్నం చేద్దామని అన్నారు. కేసీఆర్ ఉద్దేశం రిజర్వేషన్లను పెంచవచ్చు కానీ బీజేపీ అడ్డుకుంటోందని చెప్పడం. రిజర్వేషన్లు పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతులో లేదు. అది కేంద్రం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపే వరకూ అధికారం ఉంది. ఆ తర్వాత నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంటుంది. గతంలో  ముస్లిం , ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. కానీ ఇంత వరకూ ఆమోదం లభించలేదు. అదే ఉద్దేశంతో ఎస్సీ రిజర్వేషన్లు పెంచుకునేందుకు ప్రయత్నిద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


తీర్మానం చేసి పంపితే తామే కేంద్రం వద్ద ఆమోదింప చేస్తామని బండి సంజయ్ సవాల్..!


అయితే రిజర్వేషన్లను అడ్డుకుంటోంది  బీజేపీ అన్న అర్థం లో కేసీఆర్ విమర్శలు చేయడంతో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా చేపట్టిన సభలో టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అసెంబ్లీ ఆమోదించి పంపితే... కేంద్రంతో మాట్లాడి అమల్లోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. నిజానికి ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపు తీర్మానం కేంద్రం వద్దనే ఉంది.కానీ బండి సంజయ్ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడారు కాబట్టి.. మళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపమని ఆయన డిమాండ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


టీఆర్ఎస్, బీజేపీ నేతలు రిజర్వేషన్లపై చేస్తోంది రాజకీయమే..!? 


అయితే  తెలంగాణ సర్కార్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంచుతూ తీర్మానం చేసి పంపినా కేంద్రం ఆమోదిస్తుందా అన్న సందేహం చాలా మందికి ఉంది. ఎందుకంటే ఆ అధికారం కేంద్రం చేతుల్లో కూడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల బలహీనవర్గాలు ఎక్కువ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి. కానీ తెలంగాణకు అలాంటి అనుమతి లేదు. అందుకే కేంద్రం కూడా తెలంగాణ రిజర్వేషన్ తీర్మానాలను మళ్లీ మళ్లీ పంపినా ఆమోదించే పరిస్థితి ఉండదు. కానీ బండి సంజయ్ మాత్రం ఆమోదించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. రెండు వర్గాలూ ఓట్ల రాజకీయం చేస్తున్నాయని ఇతర పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించారు.