Karnataka Maharashtra Row:


వచ్చే వారం అసెంబ్లీలో తీర్మానం..


కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఎన్నో రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇప్పుడు మరోసారి ఆ చిచ్చు రేగింది. దాదాపు 15 రోజులుగా అక్కడ పోలీసుల పహారా పెరిగింది. ఈ క్రమంలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీలో ఓ ప్రతిపాదనను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ దీనిపై స్పందించారు. వచ్చే వారం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ప్రవేశ పెట్టిన తీర్మానం కన్నా 10 రెట్లు మెరుగైన తీర్మానం తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆకాంక్షల్ని, ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని..మహారాష్ట్రకు ఒక్క ఇంచు భూమి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. పదేపదే మహారాష్ట్ర ప్రభుత్వమే సరిహద్దు వివాదాన్ని లేవనెత్తుతోందని విమర్శించింది. అయితే...ఈ నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. "ఇద్దరు ముఖ్య మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యాక కూడా కర్ణాటక అలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. మేం మాత్రం చర్చల ద్వారా సమస్యను
పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం" అని మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ స్పష్టం చేశారు. 


కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు..


నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇవాళే ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని భావించింది. కానీ...బీజేపీ ఎమ్మెల్యే ముక్త తిలక్ మృతితో ఇది వాయిదా పడింది. అందుకే...సోమవారం ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరాఠీ ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.  మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరిగిన నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్ణాటకలో నిరసనకారులు ఇటీవల దాడులు చేశారు. స్సులపైకి రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్ ప్రకటించింది. అక్కడికి 
బస్సులను నడపడం శ్రేయస్కరం కాదని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించడంతో తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపింది.


సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఈ ఆందోళనకర పరిస్థితులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కారణమని పవార్‌ ఆరోపించారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న కన్నడ, మరాఠి మాట్లాడే గ్రామాలు తమకే చెందినవంటూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఇటీవల ప్రకటనలు చేశారు. దీంతో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ బెళగావి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
ఇదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలపై రాళ్లు రువ్వి దాడి చేయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.


Also Read: Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనాపై ఎలా పని చేస్తుంది?