Land Scam Row: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి భూ కుంభకోణం కేసులో హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు మరోసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. గవర్నర్ నోటీసులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య ఈ మేరకు కోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..సిద్దరామయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 


"ప్రస్తుతం ఈ కేసుని ఈ కోర్టు విచారిస్తోంది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా జరగాల్సి ఉంది. తదుపరి విచారణ వరకూ ట్రయల్ కోర్టు సిద్దరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు"


- కర్ణాటక హైకోర్టు


 






ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. అయితే హైకోర్టు మాత్రం సిద్దరామయ్యకి సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. MUDA స్కామ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే సిద్దరామయ్య తేల్చి చెప్పారు. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఆగస్టు 17న సిద్దరామయ్యపై చర్యలకి గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపించారు. ఇది అనైతికమని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సిద్దారమయ్య తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు. ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఫిర్యాదు చేసి నోటీసులు ఇవ్వడంలో అర్థం లేదని వాదించారు. (Also Read: Viral Video: రెండో అంతస్తు నుంచి మీద పడిన ఏసీ, విలవిలలాడి అక్కడికక్కడే వ్యక్తి మృతి - వీడియో)


ఏంటీ స్కామ్..?


మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. కేసరు గ్రామంలో సిద్దరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల స్థలం ఉంది. దీన్ని MUDA అక్వైర్ చేసుకుంది. ఇందుకు బదులుగా మరో చోట 14 స్థలాలు పరిహారంగా ఇచ్చారు అధికారులు. అయితే..MUDA సేకరించిన స్థలం ధరతో పోల్చితే పరిహారంగా ఇచ్చిన స్థలాల విలువ ఎక్కువని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. 


Also Read: Kolkata: కోల్‌కతా కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్, నిజాలు బయటకు వస్తాయా?