Rs 15000 salary caught having Rs 30 crore assets: కర్ణాటకలో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి ఇంటిపై ఆ రాష్ట్ర లోకాయుక్త అధికారులు దాడి చేశారు. ఆయ దాడుల్లో ఆయనకు రూ. 30 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇళ్లు, ప్లాట్లు, పొలాల జాబితా చాలా ఎక్కువగా ఉంది. కలకప్ప నిడగుండి కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో మాజీ క్లర్క్‌గా, గతంలో డైలీ వేజ్ ఎంప్లాయీగా పనిచేశారు. సర్వీసులో ఉన్నప్పుడు అతని జీతం నెలకు రూ. 15,000.
కలకప్పకు మొత్తం 24 ఇళ్లు ఉన్నాయి. కొప్పల్ తో పాటు బళ్లారిలోనిభాగ్యనగర్ లో ఈ ఇళ్లు ఉన్నాయి. అలాగే 6 ప్లాటను లోకాయుక్త అధికారులు గుర్తించారు. వీటితోపాటు 40 ఎకరాల వ్యవసాయ భూమి కలకప్ప, అతని భార్య, ఆమె సోదరుడి పేర్లపై కొనుగోలు చేశారు. దాంతో పాటు దాదాపుగా కేజీ బంగారం, కేజీన్నర వెండి, నాలుగు వాహనాలను గుర్తించారు. ఈ ఆస్తులు కలకప్ప ఒక్కడి పేరిటే కాకుండా అతని భార్య , ఆమె సోదరుడి పేర్లపై కూడా రిజిస్టర్ చేశారు.
2025 ఆగస్టు 1న, కొప్పల్ జిల్లాలోని కలకప్ప నిడగుండి నివాసంలో కర్ణాటక లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. కలకప్ప పని చేసిన కార్యాలయంలో రూ. 72 కోట్ల అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేశారు. కలకప్ప నిడగుండి , మాజీ KRIDL ఇంజనీర్ Z.M. చిన్చోల్కర్‌లు 96 ప్రాజెక్టులకు నకిలీ బిల్లులు , డాక్యుమెంట్లను సృష్టించి రూ. 72 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో KRIDLలో అవినీతిపై వచ్చిన సమాచారం ఆధారంగా లోకాయుక్త చర్యలు తీసుకుంది.
లోకాయుక్త అధికారులు కలకప్ప నిడగుండి ఆస్తుల మూలాలను గుర్తించేందుకు లోతైన విచారణ జరుపుతున్నారు. Z.M. చిన్చోల్కర్‌తో పాటు ఈ కేసులో ఇతర అధికారులు మరియు సిమెంట్ సప్లయర్‌లపై కూడా విచారణ జరుగుతోంది. ఈ కేసును అక్రమాస్తుల కింద విచారిస్తున్నారు. నిందితులపై లోకాయుక్త చట్టం కింద చర్యలు తీసుకుంటున్నారు.