ABP  WhatsApp

Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'

ABP Desam Updated at: 17 Dec 2021 04:33 PM (IST)
Edited By: Murali Krishna

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన అత్యాచార వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్త దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలు చేయడం ఒక తప్పైతే, ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామన్నట్లు స్పీకర్ నవ్వడం మరో తప్పు.

స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలా.. బాధ్యత ఉండక్కర్లేదా?

NEXT PREV

"అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమం".. ఏమనిపిస్తోంది ఈ మాటలు వింటే.. రక్తం ఉప్పొంగుతుంది కదా..! నరనరాన ఉరకలై పారుతోన్న రక్తం.. ఆ అమ్మ పాలతో తయారైంది కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచమైన సంస్కృతికి ఈ మాటలు నిదర్శనం కాదా? ఏటెళ్లిపోతోంది భారతం.. ఏమైపోతోంది దేశం?


ఆనాడు నిండు కొలువులో ద్రౌపదిని కించపరచి.. వస్త్రాపహరణం చేస్తుంటే.. సభ మొత్తం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. భీష్మ పితామహ, ద్రోణాచర్య, కృపాచార్య వంటి వారు తలవంచి మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనమే వారిని తరువాతి కురుక్షేత్ర మహాసంగ్రామంలో నామరూపాల్లేకుండా చేసింది. 


మరి ఏకంగా చట్టాలు చేయాల్సిన సభలో, ప్రజా భవిష్యత్తును నిర్మించాల్సిన అసెంబ్లీలో ఓ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్.. మహిళల గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే వారించాల్సింది పోయి.. పకపకా నవ్వుతారా? ఏకంగా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఆ మాటలను ఆస్వాదిస్తుంటే ఏమనాలి? ఏటెళ్లిపోతోంది భారతం.. ఏమైపోతోంది దేశం?


ఎవరీ మహానుభావుడు!


ప్రస్తుతం ఈ కామెంట్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ కామెంట్ చేసిన వ్యక్తికి మాత్రం ఇది కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. ఆయన గురించి తెలుసుకుంటే మనకి ఈ విషయం అర్థమవుతుంది.


రమేశ్ కుమార్.. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎందుకంటే అవి సాధారణ వ్యాఖ్యలు కాదు. మహిళా వ్యక్తిత్వాన్నే దెబ్బతిసేలా అందులోనూ చట్టసభలో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీరే చూడండి.


ఆస్వాదించండి..


కర్ణాటక అసెంబ్లీలో గురువారం రైతుల సమస్యలపై మాట్లాడేందుకు శాసనసభ్యులు.. స్పీకర్‌ను సమయం కోరారు. అందుకు ప్రతిగా స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్దే.. అందరికీ సమయం ఇచ్చుకుంటూ పోతే తాను సభను ఎలా నడపగలను అని అన్నారు. 



ఇప్పటికే ఈ అంశంపై చర్చించేందుకు చాలా సమయం ఇచ్చా. 25 మంది సభ్యులు మాట్లాడారు. ఇంకా సమయం అడిగితే నేను సభను ఎలా నడపాలి. ఇక మీరు ఏం చేసినా నేను ఆస్వాదించాలి అన్నట్లు ఉంది పరిస్థితి. సభను నడపడం మానేసి మీరు చెప్పేదానికి అవును, అవును  అనాలి.                                                         - విశ్వేశ్వర్ హెగ్దే, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్   
                                 


ఆ వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.







అధ్యక్షా.. ఓ సామెత ఉంది.. అదేంటంటే.. అత్యాచారం అనివార్యమైనప్పుడు.. దానిని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమం. ప్రస్తుతం మీ పరిస్థితి అలానే ఉంది.                                                         -  రమేశ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే


నవ్విన సభ..


రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన స్పీకర్ సహా సభ్యులంతా గట్టిగా నవ్వారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయి.. రమేశ్ కుమార్‌పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత చేసేదేం లేక.. క్షమాపణలు చెప్పారు రమేశ్ కుమార్.






అంతకుముందు..


2019లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో కూడా రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో వివాదాస్పద ఆడియో టేపుల్లో తన పాత్రపై మీడియా ప్రశ్నలు అడుగుతుంటే రమేశ్ కుమార్ ఈ కామెంట్లు చేశారు.



నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా అయిపోయింది. ఎందుకంటే అత్యాచార బాధితురాలిని.. రేప్ ఎలా జరిగింది? అంటూ ఇలానే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తారు.                                                          - రమేశ్ కుమార్


యడియూరప్పపై..


2011లో అవినీతి ఆరోపణల కారణంగా సీఎం పీఠం నుంచి బీఎస్ యడియూరప్ప దిగిపోవాల్సి వచ్చింది. ఆ విషయం గురించి 2014లో అసెంబ్లీలో రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



ఈ రాష్ట్రంలో యడియూరప్ప మాత్రమే అవినీతి చేయలేదు. కానీ అవినీతి చేసిన తప్పించుకునే తెలివితేటలు యడియూరప్పకు లేవు. చాలా మంది 5 స్టార్ హోటళ్లలో భోజనం చేసేటప్పుడు ఒడిలో నాప్కిన్ వేసుకుంటారు. వారి బట్టలకు మరక పడకుండా తింటారు. నాప్కిన్ మాత్రమే కాస్త పాడవుతుంది. ఆ తర్వాత ఫింగర్ బౌల్‌లో చేయి కడిగేసుకుంటారు.   ఓ రాజకీయ నాయకుడు తెలివైనోడు అయితే తాను అవినీతి చేసినా తెలియకుండా జాగ్రత్తపడతాడు. కానీ యడియూరప్ప తన బట్టలకు మరకలు అంటించుకున్నారు. అవినీతి చేయడం తప్పు కాదు, కానీ తప్పించుకోవడం తెలియాలి.                                                    - రమేశ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే


Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు


Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్


Also Read: Congress MLA: అత్యాచారం అనివార్యమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు


Also Read: Watch Video: దటీజ్ మోదీ.. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన భారత ప్రధాని.. నెటిజన్ల ప్రశంసలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 17 Dec 2021 04:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.