కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైను ఎంపిక చేసిన నాటి నుంచి కేబినెట్ విస్తరణపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఈరోజు కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు. కొత్త మంత్రులు ఈరోజు మధ్యాహ్నం 2. గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించినట్లు తెలిపారు. కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు.
యడియూరప్ప కుమారుడికి ఛాన్స్..
మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు కేబినెట్ లో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని బొమ్మై తెలిపారు.
డిప్యూటీ సీఎం ఉందా..
జులై 28న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బసవరాజ్ బొమ్మై ఇప్పటికే రెండు సార్లు దిల్లీ పర్యటనకు వచ్చారు. దిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు బొమ్మై. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బొమ్మైకు కేంద్రమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.