Karnataka Assembly Elections 2023: 



సుర్జేవాలా ఆరోపణలు..


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. బీజేపీ ఆయనను హత్యకు స్కెచ్ వేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ని కూడా షేర్ చేసింది కాంగ్రెస్. ఖర్గేతో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని తేల్చి చెప్పింది. బీజేపీ నేత కాల్‌ రికార్డింగ్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. చిత్తాపూర్‌ బీజేపీ అభ్యర్థి హస్తం ఉందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని తట్టుకోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సుర్జేవాలా మండి పడ్డారు. 


"కన్నడ ప్రజలు కాంగ్రెస్‌ను ఎంతో అభిమానిస్తున్నారు. బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేసే అవకాశాలే లేవు. ఇది చూసి బీజేపీ అసహనానికి గురవుతోంది. అందుకే మర్డర్‌ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది. ఓటమిని ఎదుర్కోలేక ఇంతగా దిగజారిపోతున్నారు"


- రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ సీనియర్ నేత 






ట్విటర్‌లో ఆడియో క్లిప్ పోస్ట్ చేసిన కాంగ్రెస్...చిత్తాపూర్ నియోజకవర్గ ప్రతినిధి మణికంఠ్ రాథోడ్ ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించింది. 


"చిత్తాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి మణికంఠ్ రాథోడ్ ఖర్గే హత్యకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ వ్యక్తిపై 40 క్రిమినల్ కేసులున్నాయి. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై ఇద్దరూ కలిసి ఈ వ్యక్తిని హత్యకు పురమాయించారు. ఖర్గే కుటుంబాన్ని చంపేస్తాం అని ఎలా మాట్లాడుతున్నారో వినండి. 40% కమిషన్ ప్రభుత్వం ఇలా దిగజారిపోయింది. ఇది కేవలం ఖర్గేపై మాత్రమే చేసే దాడి కాదు. మొత్తం కన్నడ ప్రజలపై జరగనున్న దాడి"


- కాంగ్రెస్ 


ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విషసర్పం అని, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో భాగంగా కలబుర్గిలో ఖర్గే మాట్లాడారు. ఆ సమయంలోనే ఇలా నోరు జారారు.బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ప్రధాని మోదీ గురించి మాట్లాడలేదని, కేవలం బీజేపీ ఐడియాలజీ గురించి మాత్రమే కామెంట్ చేశానని అన్నారు. వాళ్ల ఐడియాలజీ విషపూరితమైన పాము లాంటిదని, ముట్టుకుంటే కాటుకు గురి కాక తప్పదని అన్నట్టు వివరించారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ ఓ విషసర్పం లాంటి వాడు. అది విషమా కాదా అని రుచి చూశారా..? ఇక అంతే. ఆ విషం ఎక్కి వెంటనే చచ్చిపోతారు" 


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 


Also Read: Unemployment Rate: ఉద్యోగమో రామచంద్రా! ఏప్రిల్‌లో 8% దాటిన నిరుద్యోగిత రేటు