Unemployment Rate In India: ఇటీవలే చైనాను దాటి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాలు. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగ గణాంకాలు ఇలాంటి సవాలు తీవ్రతను పెంచుతూనే ఉంటాయి. తాజా డేటా ప్రకారం, 2023 ఏప్రిల్‌ నెలలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతం దాటింది.


సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (Centre for Monitoring India Economy - CMIE) తాజా సమాచారం ప్రకారం, భారతదేశ నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.11 శాతానికి పెరిగింది, ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. మార్చి నెలలో నమోదైన 7.8 శాతం నుంచి ఇది పెరిగింది. 


పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మార్చిలోని 8.51 శాతం నుంచి ఏప్రిల్‌లో 9.8 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగం మార్చిలోని 7.47 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.34 శాతానికి స్వల్పంగా తగ్గింది.


ఏప్రిల్‌లో పెరిగిన కార్మికుల భాగస్వామ్యం
దేశంలో నిరుద్యోగం పెరిగినప్పటికీ, ఏప్రిల్‌లో భారతదేశ శ్రామిక శక్తి భాగస్వామ్యం (labour force participation) 2.55 కోట్లు పెరిగి 46.76 కోట్లకు చేరుకుంది, మొత్తం భాగస్వామ్య రేటు 41.98 శాతానికి పెరిగింది. లేబర్ పార్టిసిపేషన్ రేట్ అంటే, పని చేయడానికి అర్హులైన వ్యక్తుల సంఖ్యను సూచించే గణాంకం. మార్చి నెలలో దీని రేటు 39.77 శాతంగా ఉంది, ఏప్రిల్‌లో 41.98 శాతానికి పెరిగింది. అంటే, పని చేయగల వారి సంఖ్య ఒక్క నెలలోనే 2.55 కోట్లు పెరిగింది. ఈ స్థాయి లేబర్‌ పార్టిసిపేషన్‌కు తగ్గట్లుగా ఉద్యోగాలను సృష్టించడం ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందే. ముఖ్యంగా, వచ్చే వేసవిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ద్వారా ముచ్చటగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టాలని చూస్తున్న నరేంద్ర మోదీకి ఇది చాలా పెద్ద సవాలు.


అయితే, CMIE డేటా నుంచి కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో శ్రామిక శక్తిలో చేరిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉండటం వల్ల ఉపాధి దొరుకుతుందన్న విశ్వాసం ప్రజల్లో పెరిగిందని సూచిస్తోందని CMIE పేర్కొంది. గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెలలో శ్రామిక శక్తికి జత కలిసిన వారిలో 87 శాతం మంది ఉపాధి పొందడంలో విజయం సాధించారు. అంటే ఏప్రిల్ నెలలో 2.21 కోట్ల మందికి ఉపాధి లభించింది. ఈ కారణంగా, ఏప్రిల్‌లో మొత్తం ఉపాధి కూలీల సంఖ్య 42.97 కోట్లకు పెరిగింది, ఇది నెల క్రితం 40.76 కోట్లు. జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని ఇది తెలియజేస్తోంది.


గ్రాడ్యుయేట్ నిరుద్యోగంలో ఏటికేడు క్షీణత
వార్షిక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (Periodic Labour Force Survey - PLFS) నివేదికల ప్రకారం, గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లలో నిరుద్యోగం రేటు తగ్గుముఖం పడుతోందని కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి మార్చి నెలలో వెల్లడించారు. “తాజాగా అందుబాటులో ఉన్న వార్షిక PLFS నివేదికల ప్రకారం... 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో, 15 ఏళ్లు & అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు వరుసగా 17.2%, 15.5%, 14.9%గా ఉంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ల నిరుద్యోగిత రేటులో తగ్గుదల ధోరణిని ఇది చూపుతోంది" అని తెలి చెప్పారు. స్టాటిస్టిక్స్ & ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే PLFS, దేశంలో ఉపాధి & నిరుద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది.


వరుసగా మూడో సంవత్సరం కూడా, 2023-24 బడ్జెట్‌లో మూలధన పెట్టుబడి వ్యయాన్ని 33 శాతం పెంచి రూ. 10 లక్షల కోట్లకు పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇది జీడీపీలో 3.3 శాతం. ఫలితంగా, మౌలిక సదుపాయాలు & ఉత్పాదక సామర్థ్యం పెంపులో పెట్టుబడులు పెరిగాయి, ఉద్యోగ కల్పనను పెంచాయి.