Karnataka Election 2023:


కాంగ్రెస్ భారీ ఆశలు 


కర్ణాటక ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. ఇటీవల విడుదలైన ABP C Voter Opinion Pollలోనూ కాంగ్రెస్‌కే ఎక్కువగా విజయావకాశాలున్నాయని తేలింది. హైకమాండ్ కూడా విజయంపై చాలా ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే విస్తృత ప్రచారానికి సిద్ధమవుతోంది. స్టార్ క్యాంపెయిన్‌ర్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో కీలక నేతలందరి పేర్లున్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, ఎంపీ శశిథరూర్‌ ప్రచారం చేయనున్నారు. మొత్తం 40 మంది నేతలు ఈ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంక గాంధీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆమెతో పాటు డీకే శివకుమార్, సిద్దరామయ్య, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ కూడా ప్రచారంలో పాలు పంచుకోనున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ పేరు మాత్రం ఈ లిస్ట్‌లో లేదు. ఇప్పటికే రాజస్థాన్‌లో గహ్లోట్ వర్సెస్ పైలట్ ఫైట్ జరుగుతూనే ఉంది. సొంత ప్రభుత్వంపైనే నిరసన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష చేశారు సచిన్ పైలట్. సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశ పడుతున్న పైలట్‌కు హైకమాండ్ నుంచి మద్దతు లభించడం లేదు. ఫలితంగా తిరుగుబావుటా ఎగరేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. పైలట్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అధిష్ఠానం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ అవడం లేదు. 






బీజేపీ లిస్ట్‌ ఇది..


అంతకు ముందు బీజేపీ కూడా కర్ణాటక స్టార్ క్యాంపెయినర్‌ల లిస్ట్‌ని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక బాధ్యతలు తీసుకున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే...వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నామినేషన్ దాఖలు చేశారు. మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారన్న వార్తలొచ్చినా ప్రస్తుతానికి అదేదీ నిర్ధరణ కాలేదు. ఈ క్రమంలోనే సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల తరవాత ప్రత్యక్ష ఎన్నికలకు ఇక దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేదా అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. 


Also Read: Mamata Banerjee: ప్రతిపక్షాలు సైలెంట్‌గా ఉన్నాయనుకోకండి, తుఫానులా ముంచుకొస్తాం - బీజేపీకి దీదీ వార్నింగ్