Karimnagar News: అయోధ్య అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్ లో రాముడు జన్మించిన జన్మస్థలం. అయితే నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఓ కళాకారుడు తన భక్తి చాటుకున్నాడు. కరీంనగర్ కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో ఓ శిల్పకళాకారుడు కేవలం ఇసుకతో రెండు రోజులు శ్రమించి సైకత రూపంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. దీని గురించి, ఆ సైకతాన్ని నిర్మించిన తీరును కళాకారుడు వెంకటేశ్ ఏబీపీకి వివరించారు. 


అయోధ్యకు అందరూ వెళ్లలేరు కాబట్టే కరీంనగర్ లోని భక్తజనుల కోసం మహాశక్తి ఆలయంలో ఈ సైకత రూపాన్ని తయారు చేశామని చెప్పాడు. ఈ కళ తనకు అలవరడం ఒక అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. 10 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండు రోజుల వ్యవధిలో మొత్తం ఇసుకతో ఈ అయోధ్య రామాలయ సైకత రూపాన్ని తయారు చేశామని అన్నారు సైకత శిల్పి వెంకటేశ్.


విజయవాడలోనూ..
అయోధ్యలో బాల రాముడి రామమందిర విగ్రహ ప్రతిష్ఠ సందర్బంగా ఇసుకతో సైకత శిల్పాన్ని ఓ కళాకారుడు చేపట్టారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి సమీపంలో చేశారు. మందిర నిర్మాణాలు, రాముడి రూపంతో శిల్పి బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకత శిల్పి ఆధ్వర్యంలో 30 టన్నుల ఇసుక, ఐదుగురు సభ్యులతో ఉదయం 6 గంటలకు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గతంలో శిల్పి 8 మంది ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డులను పొంది, 8 జాతీయ స్థాయిలో అవార్డులను పొందారు. తనకు రాముడు అంటే చాలా ఇష్టమని, ఈ శిల్పంతో తనకు రాముడిపై ప్రేమను చాటుకున్నానని వరప్రసాద్ తెలిపారు.