Kanwar Yatra Controversy: కన్వార్ యాత్ర వివాదంపై (Kanwar Yatra Row) సుప్రీంకోర్టు యోగి సర్కార్‌కి షాక్ ఇచ్చింది. యాత్ర జరిగే దారిలో షాప్‌లు కచ్చితంగా నేమ్‌బోర్డ్‌లు పెట్టుకోవాలని, ఓనర్ల పేర్లు కూడా రాయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై అసహనం వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని తేల్చి చెప్పింది. ఫుడ్‌ షాప్‌లలో నేమ్ బోర్డ్‌లలో కేవలం మెనూ మాత్రమే డిస్‌ప్లే చేస్తారని, పేర్లతో పనేముందని ప్రశ్నించింది. జస్టిస్ రుషికేశ్ రాయ్‌, జస్టిస్ SVN భట్టితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీతో పాటు ఇవే ఉత్తర్వులు ఇచ్చిన ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరిపింది. ఈ విచారణ సమయంలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ఎలాంటి అధికారం లేకుండానే ఈ ఉత్తర్వులు జారీ చేశారని, చట్టపరంగా ఇలాంటివి ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని తేల్చి చెప్పారు. 


"ఇవి పూర్తిగా ప్రజల్ని తప్పుదోవపట్టించే ఉత్తర్వులు. హోటల్ యజమానులు పేర్లు డిస్‌ప్లే చేయకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. వేలాది కిలోమీటర్ల పొడవునా యాత్ర జరుగుతుంది. ఆ దారిలో ఎన్నో దుకాణాలున్నాయి. వాళ్లంతా ఎలా బోర్డ్‌లు పెడతారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని బతుకున్న వాళ్లున్నారు. ఓ హోటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి మెనూని చూస్తాం కానీ మనకి సర్వ్ చేసే వాళ్లు ఎవరని ఆలోచిస్తామా. ఓ వర్గంపై కావాలని వివక్ష చూపించినట్టే అవుతోంది. ఇది ఏ మాత్రం రాజ్యాంగబద్ధం కాదు"


- అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ అడ్వకేట్ 






ఎన్నో దశాబ్దాలుగా ఈ యాత్ర జరుగుతోందని, అన్ని వర్గాలూ ఒకరికొకరు సాయం చేసుకుని యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నాయని సింఘ్వీ వివరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ పోలీస్‌ కమిషనర్‌కీ ఈ అధికారాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కన్వార్ యాత్ర జరిగే దారిలో అన్ని షాప్‌లు ఓనర్ పేర్లు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ఆ తరవాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాల నుంచే కాకుండా NDA మిత్రపక్షాలైన RLD, JDU నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. 


Also Read: Viral News: అదిరేటి డ్రెస్ మీరేస్తే - ర్యాంప్ వాక్ చేస్తున్న మోదీ, కిమ్‌ని చూశారా - AI ఫ్యాషన్‌ షో మాయ