Andhra Pradesh Governor Speech In Budget Session 2024: గత ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదు. రాష్ట్ర మూలధన వ్యయం 60 శాతం మేరకు తగ్గింది. జల వనరులు, రవాణా, రోడ్లు, భవనాలు వంటి శాఖలను నిధుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా జల వనరులపై మూలధన వ్యయం 56 శాతం మేరకు తగ్గింది.  రోడ్లు, భవనాల్లో 85 శాతానికి తగ్గింది. రాష్ట్ర సొంత పన్ను రెవెన్యూ వార్షిక వృద్ధి రేటు 12.8 శాతం నుంచి 8.1 శాతానికి పడిపోయింది. రెవెన్యూ వ్యయం 7.8 శాతం నుంచి 10.5 శాతానికి పెరగ్గా మూలధన వ్యయం వృద్ధి 26.4 శాతం నుంచి 3.4 శాతానికి క్షీణించింది.


"నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. అమరావతి కలను నీరుగార్చే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వం వికేంద్రీకరణ పాలన ముసుగులో మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. ఇలాంటి విధ్వంసకర నిర్ణయాలు, వాటి పర్యవసానాలను పట్టించుకోకపోవడం యువతలో, ఉద్యోగార్థులలో అశాంతికి దారి తీసింది." 


"అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. భారతదేశపు రైస్ బౌల్ 'అన్నపూర్ణ'గా ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం ఆహార భద్రతను కల్పించడంలో ఇతర రాష్ట్రాలకు మద్దతునిస్తుంది. స్వయం సహాయక బృందం విధానంలో అగ్రగామిగా, పేద మహిళల్లో పారిశ్రామికతత్వం, ఆదాయ మరియు పొదుపు విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా నిలిచింది. సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది రాష్ట్రం దార్శనికతకు మూలస్తంభం."


"పారదర్శకత లోపించిన గత ప్రభుత్వ దుష్పరిపాలన, గత ఐదేళ్ళ పాలనలో వ్యవస్థల వైఫల్యాలు వివరించేందుకు శ్వేతపత్రాలను విడుదల చేసింది. తగ్గిన రాష్ట్ర ఆదాయం ఫలితంగా అత్యవసరంగా చేయాల్సిన కనీస చెల్లింపు బాధ్యతా వ్యయాన్ని భరించడం నూతన ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలు, సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారానికి రుణం తిరిగి చెల్లింపులు. విద్యుత్ రంగ బకాయిల చెల్లింపులు, పౌర సరఫరాలు, ఇతర అప్పుల చెల్లింపులు సవాలుగా మారడంతో గత ఐదేళ్లలో మొత్తం అప్పులు రెట్టింపు కంటే మించిపోయాయి."


ప్రభుత్వ పరిపాలనను తిరిగి గాడిలో పెట్టడం చాలా సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చడం ప్రారంభించిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పింఛన్లను పెంపు స్కిల్‌ గణన ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామన్నారు. 


పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు రూ.5 లకే అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం ఇవ్వడం వంటి ట్రేడ్మార్క్ పాలన ప్రారంభించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అన్ని ప్రయత్నాలను చేస్తుందని గవర్నర్ విశ్వసించారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి సహా కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయూతను అందించి రాష్ట్రానికి ఉదారంగా సహాయాన్ని అందించాలని విజ్ఞప్తులు చేసినట్టు పేర్కొన్నారు. 


ఆందోళనకరమైన ఆర్థిక పరిస్థితి అర్ధం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించడానికి సమిష్టి ఆలోచన, మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు అవసరమన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనే నూతన అభివృద్ధి నమూనా దృష్ట్యా స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికల అభివృద్ధి వ్యవస్థను పునఃప్రారంభించే మార్గాలను అన్వేషించాలి. ఐదేళ్ళలో జరిగిన వాస్తవ నష్టం ఇంతవరకు బహిరంగ చర్చకు రాలేదని గుర్తు చేశారు. 


ఇప్పుడు విభిన్నమైన, క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నామని, అధికారంలోకి వచ్చామన్న సంతోషం ఎవరిలో లేదన్నారు. ప్రజల ఆకాంక్షలు తక్షణమే నెరవేర్చే మార్గం కూడా లేదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, అర్ధవంతమైన చర్చల తరువాత బడ్జెట్‌కు వెళ్ళాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కష్టాలను చూస్తూ కుంగిపోవడం కంటే ఉన్న అవకాశాలను వినియోగించుకొని ప్రజలకు న్యాయం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యమని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.