ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కల్యాణ్ కుమారుడు శ్రీ రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడి సంతాపం తెలిపారు. కల్యాణ్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కల్యాణ్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఎనలేని సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. 






మోదీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కల్యాణ్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు.






రాజ్ నాథ్ సింగ్ సంతాపం..






కల్యాణ్ సింగ్ మృతి పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వం, పనితో కల్యాణ్ భారత రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. కల్యాణ్ మృతితో ఏర్పడిన శూన్యతను ఎప్పటికీ పూడ్చలేమని అన్నారు. ఆయన మరణంతో తాను పెద్ద అన్నయ్యను, సహచరుడిని కోల్పోయినట్లు ఉందని విచారం వ్యక్తం చేశారు.


మూడు రోజులు సంతాప దినాలు..


కల్యాణ్ సింగ్ మృతి కారణంగా రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. గంగా నది తీరం నరోరాలో ఆగస్టు 23 సాయంత్రం అంతిసంస్కరాలు చేయనున్నట్లు యోగి తెలిపారు. ఆగస్టు 23న పబ్లిక్ హాలీడేగా ప్రకటించారు.