ఆఫ్ఘనిస్థాన్ మ‌రోసారి తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోతుండ‌టంతో అక్కడి ప్పభుత్వం ఓ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే మూడింట రెండు వంతుల ప్రాంతాలను తాలినన్లు ఆక్రమించేశారు. అయితే ఇదంతా కాదని ఓ ఆఫర్ తో ఆఫ్ఘనిస్థాన్ ముందుకొచ్చింది. ఈ హింసను ఆపితే.. ప్రభుత్వంలో మీకూ వాటా ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. తాలిబ‌న్ తిరుగుబాటుదారులు  రాజ‌ధాని కాబూల్ దగ్గరకు  వ‌స్తుండ‌టంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం  తీసుకున్నట్టు అర్థమవుతోంది. మరోవైపు ఆఫ్ఘాన్ నుంచి  అమెరికా ద‌ళాలు వెళ్లిపోతుండ‌టంతో మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్యమేలేందుకు సిద్ధమయ్యేలా ఉన్నారు.


ఈ నెల చివ‌రిలోగా అమెరికా దళాల్లో చివ‌రిది ఆఫ్ఘ‌నిస్థాన్‌ను వీడ‌నుంది. ఇదే పక్కా ప్లాన్ అనుకున్న  తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ముఖ్యమైన న‌గరాల‌ను ఆక్రమిస్తూ వస్తోంది. వాళ్లను ఎదుర్కొవడం ఆఫ్ఘాన్ బలగాల వాళ్ల కావట్లేదు. ఇప్పటికే  రాజ‌ధాని కాబూల్, మ‌రో ప్రధాన న‌గ‌రం కాంద‌హార్ మ‌ధ్య హైవేపై ఉన్న ఘ‌జినీ న‌గ‌రం కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కాంద‌హార్‌లోనూ రెండు వ‌ర్గాల నడుమ భీక‌ర యుద్ధం జ‌రుగుతోంది. అక్కడి ప్రావిన్సియ‌ల్ జైలును స్వాధీనం చేసుకున్నట్లు తాలిబ‌న్లు ప్రకటించారు.


ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న ముష్కరులు కాబుల్​కు సమీపంలోని ఘాజినీ నగరాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆక్రమణ అనంతరం నగరంలో తమ జెండాలను ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను తాలిబన్లే పోస్ట్ చేశారు. ఘాజినీతో కలిపి మొత్తం 10 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల హస్తగతం అయ్యాయి. ప్రస్తుతం కాబుల్ నగరానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. తాలిబన్ల దురాక్రమణ ఇంత వేగంగా సాగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశ రాజధానితో పాటు మిగిలిన కొన్ని నగరాలను కాపాడుకునేందుకే సర్కారు అధికారం పంచుకుందాం అనే ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


ఘాజినీ నగరం ఎంతో ముఖ్యం


ఘాజినీ నగరం తాలిబన్ల చేతిలోకి వెళ్లడమనేది.. వ్యూహాత్మక ఎదురుదెబ్బే అని తెలుస్తోంది. కాబుల్- కాందహార్ హైవే మధ్య ఉన్న ఘాజినీ.. అఫ్గాన్ రాజధానిని, ఆ దేశ దక్షిణాది రాష్ట్రాలను కలుపుతుంది. ఈ నగరం ఆక్రమణతో.. అఫ్గాన్ సైనికుల రవాణా కష్టతరం అవుతుంది.  దక్షిణాది నుంచి అఫ్గాన్ భూభాగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లకు ఛాన్స్ ఉంటుంది. 


అఫ్గానిస్థాన్​కు భారత్ అందించిన ఎం-35 హెలికాప్టర్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కుందుజ్ ఎయిర్​బేస్​లో ఈ హెలికాప్టర్ ఉంది. దీనికి సంబధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. చాపర్ రోటర్లను తాలిబన్లు తొలగించారు. 


ఆఫ్ఘన్ మొత్తాన్ని వీరు తమ కైవసం చేసుకుంటారేమోనని ఆ ప్రభుత్వం అనుకుంటోంది. తాజా పరిణామాలపపై అమెరికా గానీ మరే దేశం ఇంతవరకు స్పందించలేదు. హింస లేకుండా ఉండేందుకు అధికారాన్ని పంచుకుందామని ఆఫ్ఘన్ ప్రభుత్వం డీల్ పెట్టినట్టు అర్థమవుతోంది.