Amit Shah on New Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలికామని వెల్లడించారు. ఇప్పటి నుంచి స్వదేశీ చట్టాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వీటిని రూపొందించినట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇవి ఆదర్శంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఎన్నో వర్గాలకు న్యాయం జరిగే విధంగా వీటిని రూపొందించినట్టు వివరించారు. పాత చట్టాలు శిక్షలకే ప్రాధాన్యత ఇస్తే ఈ కొత్త చట్టాలు మాత్రం పూర్తిగా న్యాయం చేయడంపైనే (Bharatiya Nyaya Sanhita) దృష్టి పెడతాయని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత భారత్‌లో ఇలా స్వదేశీ చట్టాలు రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇకపై ఈ కొత్త చట్టాలతో ట్రయల్స్ వేగవంతం అవడంతో పాటు సత్వర న్యాయం జరిగి తీరుతుందని వెల్లడించారు. గత చట్టాలతో కేవలం పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేదని, కానీ ఈ కొత్త చట్టాలతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకూ రక్షణ లభిస్తుందని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు ప్రాధాన్యత ఉంటుందని, సత్వరమే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. గతంలోనూ చట్టాల్ని ఇంత పకడ్బందీగా మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.


"ఈ కొత్త క్రిమినల్ చట్టాల గురించి ప్రతిపక్షాలు ఏవేవో ప్రచారం చేస్తున్నాయి. కానీ..వీటిపై దాదాపు 9 గంటల పాటు సభలో చర్చలు జరిగాయి. దాదాపు 34 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభలోనూ ఆరు గంటల పాటు చర్చ జరిగింది. సస్పెండ్‌ చేసినా కూడా బిల్స్‌ని తీసుకొచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం సమావేశాల్లో పాల్గొనాలనే ఉద్దేశం లేక ప్రతిపక్ష నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు"


- అమిత్ షా, కేంద్రహోం మంత్రి  






తొలి కేసుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..


ఢిల్లీలో ఓ వీధి వ్యాపారిపై ఈ కొత్త చట్టాల కింద తొలికేసు నమోదైందని ప్రచారం జరిగింది. అయితే దీనిపైనా అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. తొలికేసు ఢిల్లీలోది కాదని, మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లో ఓ బైక్ దొంగతనం కేసు నమోదైందని వివరించారు. ఢిల్లీలో వీధి వ్యాపారిపై నమోదైన కేసుకి సంబంధించి పాత నిబంధనలే ఉన్నాయని వివరించారు. ఆ కేసుని డిస్మిస్ చేశారని వెల్లడించారు.


Also Read: Arvind Kejriwal: మరోసారి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్, సీబీఐ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్