Samvidhaan Hatya Diwas: ఏటా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్‌గా జరుపుతామని కేంద్రం చేసిన ప్రకటనకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. జూన్ 4వ తేదీని మోదీ ముక్తి దివస్‌గా (Modi Mukti Diwas) జరపాలని సెటైర్లు వేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు రావాలి. కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌నీ టచ్‌ చేయలేకపోయింది. NDAతో కలిసి మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అటు ఇండీ కూటమి బలం పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ సొంతగా 99 సీట్లు గెలుచుకుంది. దీన్ని ఉద్దేశిస్తూనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌..జూన్ 4వ తేదీన మోదీముక్తి దివస్ జరపాలని చురకలు అంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నైతికంగా ఆ రోజు ఓడిపోయారని మండిపడ్డారు. X వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనను దేవుడే పంపాడని ప్రచారం చేసుకునే మోదీ పదేళ్లుగా ప్రజలపైన అనధికారిక ఎమర్జెన్సీ ప్రకటించారని తీవ్రంగా మండి పడ్డారు. అందుకే ప్రజలు ఆయనకు మ్యాండేట్ రాకుండా అడ్డుకున్నారని తేల్చి చెప్పారు. 


"మోదీ తాను బయాలజికల్‌గా పుట్టలేదని, దేవుడే పంపాడని ప్రచారం చేసుకుంటారు. ఆయనే ప్రజలపై పదేళ్లుగా అనధికారిక ఎమర్జెన్సీ ప్రకటించారు. అందుకే మొన్న ఎన్నికల్లో నైతికంగా, రాజకీయంగా ఓడిపోయారు. ఫలితాలు విడుదలైన జూన్ 4వ తేదీని మోదీముక్తి దివస్‌గా ప్రకటించాలి. రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతున్న మోదీయే దేశంలోని సంస్థల్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. 1949 నవంబర్‌లో పరివార్‌ సంఘ్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. మనుస్మృతినీ పట్టించుకోలేదు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత