Amit Shah: 1975లో జూన్ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఈ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా (Samvidhaan Hatya Diwas) జరుపుతామని సంచలన ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని తెలిపారు. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నియంతృత్వ వైఖరితో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారని విమర్శించారు. ప్రజాస్వామ్య గొంతుకను అణిచివేసి ఈ దారుణానికి పాల్పడ్డారని మండి పడ్డారు. లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియానీ అణిచివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"1975లో జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లకు పంపారు. మీడియా గొంతుకనూ అణచిపెట్టారు. ఈ చీకటి రోజుకి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా జూన్ 25వ తేదీన సంవిధాన్ హత్యా దినోత్సవ్‌గా జరుపుతాం. అప్పటి అమానవీయ నిర్ణయానికి బలి అయిన వాళ్లను నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నాం"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి 


 






రాజ్యాంగం గురించి బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే బీజేపీ ఈ సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని ఏటా ప్రజలకు గుర్తు చేసేలా వ్యూహం రచించింది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లి ప్రతి చోటా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 400 సీట్ల మెజార్టీ వస్తే బీజేపీ తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటుందని ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇది ఎంతో కొంత ప్రభావం చూపించింది. అయితే...అటు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగింది. అందులో భాగంగానే ఈ సంవిధాన్ హత్యా దివస్‌ని ప్రకటించింది. ఇలా పరోక్షంగా ఆ పార్టీకి చురకలు అంటించింది. ఇకపై కాంగ్రెస్ ఎప్పుడు రాజ్యాంగం గురించి ప్రస్తావించినా బీజేపీ ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకొచ్చి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.అమిత్‌ షా పెట్టిన పోస్ట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేశారు. రాజ్యాంగాన్ని ఎంత అవమానానికి గురైందో గుర్తు చేయడానికే ఈ సంవిధాన్ హత్యా దివస్‌ని జరుపుతున్నట్టు ప్రకటించారు. భారత దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి తెర తీసిందని కాంగ్రెస్‌పై తీవ్రంగా మండి పడ్డారు. 


 






Also Read: IAS Trainee: ఆరోపణలపై స్పందించిన IAS ట్రైనీ, ఆ అధికారం లేదని కీలక వ్యాఖ్యలు