Global recession:  డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం అరవై శాతానికి చేరుకుందని జేపీ మోర్గాన్ వెల్లడించింది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం చివరి నాటికి మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఇప్పుడు 60 ఉందని జెపి మోర్గాన్ తన నివేదికలో వెల్లడించింది.  ఇది గతంలో 40 శాతం మాత్రమే ఉండేది.   అమెరికా వాణిజ్య విధానం ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదంగా మారిందని తెలిపింది.  ఎస్ & పి గ్లోబల్ కూడా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోయే అవకాశాన్ని 35 శాతానికి పెంచింది.  గోల్డ్‌మన్ సాచ్స్ వంటి కంపెనీలు అమెరికా రెసిషన్ లోకి వెళ్లడం ఖాయమని ఇప్పటికే చెప్పాయి. 

మాంద్యం ఖాయమని చెబుతున్న ఆర్థిక సంస్థలు

ఈ సంవత్సరం చివరి నాటికి ఈక్విటీలు ఇప్పటికే మాంద్యంలోకి జారుకునే అవకాశం సుమారు 40 ఉందని అని HSBC కూడా అంచనా వేసింది.  బార్క్లేస్, BofA గ్లోబల్ రీసెర్చ్, డ్యూష్ బ్యాంక్, RBC క్యాపిటల్ మార్కెట్స్ మరియు UBS గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర పరిశోధన సంస్థలు కూడా ట్రంప్ కొత్త లెవీలు అమలులో ఉంటే ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించాయి.

అమెరికాలో నిరుద్యోగిత పెరిగే చాన్స్      అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025 చివరి నాటికి మాంద్యంలోకి జారుకుంటుందని  అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని  తగ్గిస్తాయని  ఫలితంగా ఉద్యోగ నష్టాలు తప్పవని జేపీ మోర్గాన్  ప్రధాన ఆర్థికవేత్త మైఖేల్ ఫెరోలీ తన నివేదికలో వెల్లడించారు.  ఈ అంచనా ప్రకారం, 2025లో రెండవ అర్ధభాగంలో రెండు త్రైమాసికాల్లో జీడీపీ తగ్గుముఖం పడుతుంది. మూడవ త్రైమాసికంలో 1% ,నాల్గవ త్రైమాసికంలో 0.5%  తగ్గుదల ఉంటుంది.   దీని వల్ల నిరుద్యోగం రేటు 5.3%కి చేరుకుంటుందని ఫెరోలీ హెచ్చరించారు.

ప్రతీకార సుంకాలు వేస్తున్న ఇతర దేశాలు

ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లలో అన్ని దిగుమతులపై 10% బేస్‌లైన్ టారిఫ్‌తో పాటు, చైనాపై 34%, యూరోపియన్ యూనియన్‌పై 20%, జపాన్‌పై 24% వంటి అధిక రేట్లు ఉన్నాయి. ఈ చర్యలు అమెరికాలో దిగుమతి వస్తువుల ధరలను పెంచడమే కాకుండా, సరఫరా గొలుసు ఆటంకాలు, వాణిజ్య భాగస్వాముల నుండి ప్రతీకార  సుంకాలు సమస్యలను తీవ్రతరం చేస్తాయని జేపీ మోర్గాన్ విశ్లేషించింది. ఈ టారిఫ్‌ల వల్ల వస్తు ధరలు 1-1.5% వరకు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం మధ్య త్రైమాసికాల్లో ఎక్కువగా కనిపిస్తుందని అంచనా వేశారు.

భారీగా ఉద్యోగాలు కోల్పోనున్న అమెరికన్లు

ఈ విధానాలు కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టి నిలిచిపోవడంతో పాటు, ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. ఈ పరిస్థితిని  ఎదుర్కొనేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం చైనా తన సొంత సుంకాలతో అమెరికా వస్తువులపై ప్రతీకారం తీర్చుకుంది, ఇది పెరుగుతున్న వాణిజ్య యుద్ధం , ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై వినాశనం సృష్టిస్తుందనే ఆందోళనలను మరింత పెంచింది. ఇతర దేశాల కన్నా అమెరికాకే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ట్రంప్ తీరు వల్ల ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.