J&K Statehood Restoration:
రాష్ట్ర హోదా ఎప్పుడైనా రావచ్చు: నిర్మలా సీతారామన్
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నారా..? ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆత్మనిర్భర భారత్‌పై ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ సంకేతాలిచ్చారు నిర్మలా సీతారామన్. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అందుకే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో 42% మేర రాష్ట్రాలకు అందజేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని 41%కి తగ్గించాం. ఇందుకు కారణం...జమ్ము, కశ్మీర్‌ను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించడమే. బహుశా భవిష్యత్‌లో ఎప్పుడైనా జమ్ము, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుండొచ్చు" అని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు నిధులు పంచుతున్నట్టు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను ప్రధాని నరేంద్ర మోదీ మరో ఆలోచన లేకుండా అంగీకరించారని తెలిపారు.
2014-15లో 42% ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని, అప్పటికి అది 32% మాత్రమే ఉందని గుర్తు చేశారు. "ఆర్థిక సంఘం 42% రాష్ట్రాలకు పంచాలని సిఫార్సు చేసింది. అంటే...కేంద్ర ఖజానాలో నిధులు తగ్గిపోతాయి. అయినా..ప్రధాని మోదీ వెనకాడలేదు. ఆ సిఫార్సులను అమలు చేసేందుకే మొగ్గు చూపారు" అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. "మీరు పన్ను రూపంలో కట్టే ప్రతి రూపాయినీ నా రూపాయిలాగే జాగ్రత్త పరుస్తాను. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నాది. వాటిని వేరే పనుల కోసం దారి మళ్లించడం సరికాదు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ నినాదాన్ని గుర్తుంచుకోవాలి" అని అన్నారు. 2019లో మోదీ సర్కార్ జమ్ము, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని తొలగించింది. వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. అప్పటి నుంచి రాష్ట్ర హోదాపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో మరోసారి ఇది చర్చకు వచ్చింది.
విమర్శలు, వాదనలు..
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని మూడేళ్ల క్రితం రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్ణయాన్ని అంతా ప్రశంసించినా...- ఇప్పటికీ కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్‌లోని స్థానిక పార్టీలు అసహనంగా ఉన్నాయి. కేంద్రం మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించామని స్పష్టం చేసింది. అయితే...అంతటితో ఆగకుండా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు వల్లే ఇన్నేళ్ల పాటు ఈ సమస్య అలా నలుగుతూ వచ్చిందని భాజపా కాస్త గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు మరోసారి కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. "కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని అప్పట్లో నెహ్రూ తీసుకురావటం వల్లే అక్కడ అన్ని సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిష్కరించారు" అని వ్యాఖ్యానించారు. నెహ్రూ చేసిన తప్పుని ప్రధాని మోదీ సరిదిద్దారని స్పష్టం చేశారు. అమిత్‌షా మాత్రమే కాదు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో చెప్పారు. నెహ్రూ కారణంగానే కశ్మీర్‌లో సమస్యలు తలెత్తాయని అన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణాన్నీ కాంగ్రెస్ అపహాస్యం చేసిందని అమిత్‌షా మండి పడ్డారు.
Also Read: BJP Manifesto HP Election: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ, యూసీసీ అమలు చేస్తామని హామీ