Jharkhand Congress MLAs in Hyderabad  : మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో  జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. తదుపరి సీఎంగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నా గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం లేదు.  హేమంత్ సోరెన్ రాజీనామా  తర్వాత కూటమి ఎమ్మెల్యేలంతా  జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయ్ సోరెన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు తెలియజేశారు. చంపయ్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు.  కానీ అటు వైపు నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో కూటమి సభ్యులంతా ఏదో కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. 


ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు  జేఎంఎం ప్రయత్నాలు                 


సంకీర్ణ ప్రభుత్వం చీలకుండా ఉండేందుకు జేఎంఎం క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలనందరినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం జేఎంఎంకు లేదని బీజేపీ అంటోంది. కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఝార్ఖండ్‌లో అధికారం కోల్పోయే ప్రమాదముందని జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి అప్రమత్తమయింది. ప్రభుత్వాన్ని కూల్చడానికే సీఎం సోరెన్ ను అరెస్టు చేశారని.. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జేఎంఎంకు మద్దతు ఇస్తున్న 47 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.  


పూర్తి బలం ఉన్నా  కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఆహ్వానించని గవర్నర్                                     


ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉన్నాయి. జేఎంఎంకు 41 స్థానాల బలం ఉంది. ప్రభుత్వం ఏర్పడడానికి ఈ బలం సరిపోతుంది. అయినా కూడా కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. ఇప్పటికే చంపై సోరెన్‌కు  47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు రాధాకృష్ణన్‌కు తెలియజేశారు. అయినా కూడా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్ భవన్ ఖరారు చేయలేదు.    ఎమ్మెల్యేలు చేజారకూడదన్న ఆలోచనతో జేఎంఎంకు మద్దతు తెల్పుతున్న 47 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించే ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యేలను కాపాడగలరని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. 


తన అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్                                                               
 
ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుంది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించనుంది. సోరెన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించబోతున్నారు.