ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో కీలకంగా భావిస్తోన్న జాట్ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాష్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరీ.. తమతో పాటు కలిసి రావాలని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయితే జయంత్ చౌదరీ మాత్రం అమిత్ షా కే షాకిచ్చారు. భాజపా ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
అమిత్ షా భేటీ..
యూపీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ జాట్ సామాజికవర్గం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు భాజపా పావులు కదుపుతోంది. ఇందుకోసమే యూపీ జాట్ నేతలతో దిల్లీలో బుధవారం అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జాట్‌లు ఎక్కువగా మొగ్గుచూపే రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) పార్టీతో ఈసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని తాము ఆశించామని.. కానీ ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరీ మాత్రం తప్పుదోవను ఎంచుకున్నారని సమావేశంలో షా అన్నారు.
జయంత్‌కు ఇప్పటికీ తమ తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలిచ్చారు. అయితే సాగు చట్టాలపై పోరులో జాట్‌లు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పటికీ యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో ఆర్‌ఎల్‌డీ పొత్తు పెట్టుకుంది. ఇది భాజపాకు ప్రతికూలాంశంగా మారింది.
Also Read: Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి