ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ రోజుకో ప్రకటన వెలువడుతోంది. పలువురు ప్రముఖులు తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటిస్తుంటే.. మరి కొంతమంది తాము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామంటున్నారు. తాజాగా ఇద్దరు భాజపా సీనియర్ నేతలు ఇలానే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని షాకిచ్చారు.


ఆ ఇద్దరు..


యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ.. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. అయితే కారణాలు మాత్రం వెల్లడించలేదు.


భాజపా ఇటీవల విడుదల చేసిన జాబితాలో 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉన్నారు. గుడియా కటేరియాను ఔరైయా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపగా పూనమ్ షంఖ్వార్‌ను రసూలాబాద్ స్థానం నుంచి పోటీ పెట్టారు.


అంతకుముందు..


జనవరి 21న 85 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది భాజపా. ఇందులో ప్రముఖులు ఉన్నారు. మాజీ ఐపీఎస్ అసిమ్ అరుణ్, యూపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పుర్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.


7 విడతల్లో..


403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.


సర్వే ఫలితాలు..


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ ఇటీవల ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీంట్లో యూపీలో భాజపా తిరిగి అధికారం చేపట్టనున్నట్లు తేలింది. గత నాలుగు సర్వే ఫలితాల ప్రకారం భాజపా.. ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది. కానీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.


జనవరి 6న చేసిన సర్వే ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా అధికారం చేపడుతుందని 49 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని 7 శాతం మంది ప్రజలు అన్నారు.


జనవరి 3న చేసిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమకు ముఖ్యమంత్రిగా కావాలన్నారు. 32 శాతం మంది అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని తెలిపారు. 15 శాతం మంది మాత్రమే మాయావతి సీఎం కావాలని కోరారు.


Also Read: Republic day 2022: వాయుసేన శకటంతో 'శివాంగి' కవాతు.. రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ విశేషాలివే!


Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..