Jammu Kashmir Encounter:
రాజౌరిలో ఎన్‌కౌంటర్..
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేయాలనే లక్ష్యంతో నిత్యం నిఘా పెడుతోంది ఇండియన్ ఆర్మీ. నిఘా వర్గాల సమాచారం మేరకు ఆపరేషన్‌లు చేపడుతోంది. ఈ క్రమంలోనే రాజౌరిలోని కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. మే 3వ తేదీన జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు జవాన్లు. ఓ ట్రక్‌లో వెళ్తుండగా ఉన్నట్టుండి ముష్కరులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినా...లాభం లేకుండా పోయింది. కాసేపటికే వాళ్లూ మృతి చెందారు. దీనికి బదులు తీర్చుకునేందుకు సైనికులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రకదలికలను గమనించిన ఆర్మీ...మొత్తానికి వాళ్ల స్థావరాన్ని కనుగొంది. ఓ గుహలో వాళ్లు దాక్కున్నట్టు గుర్తించింది. చుట్టూ కొండలు,గుట్టలు ఉన్నాయి. ఇంతలో సైనికుల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇరువైపులా ఎన్‌కౌంటర్ మొదలు కాగా...అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బాంబు దాడి చేశారు. ఈ బాంబు ధాటికి ఇద్దరు జవాన్లు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నట్టు సమాచారం. ఈ అలజడితో రాజౌరిలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇటీవల పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై బాంబు దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. జవాన్లతో వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఫలితంగా..ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం సరిగా లేదు. ఇదే అదనుగా ఉగ్రమూకలు ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేశాయి.