Pahalgam Terror Attack: ఎత్తైన పర్వతాలు, అందమైన లోయలు, విశాలమైన మైదానంలో ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై విరుచుకుపడింది ఉగ్రమూక. రెప్పపాటులో ప్రశాంతమైన వాతావరణాన్ని భీతావహంగా మార్చేశారు. సరదాగా ఆడుతూ పాడుతూ నవ్వులు తుళ్లింతలతో ఉన్న ఆ ప్రదేశాన్ని ఆర్తనాదాలతో నింపేశారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోగా పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు ఉగ్రమూకకు బలయ్యాయి. ఆహ్లాదరకరంగా ఉన్న ఆ మైదానంలో రక్తంపారింది. అమానవీయ చర్యకు ప్రపంచం ఉలిక్కిపడింది. జమ్మూకశ్మీర్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా నేరుగా పర్యాటకులపైనే జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఆ భయానక దృశ్యాలు మళ్లీ మళ్లీ తలుచుకుని వణికిపోతున్నారు. మీకు మేమున్నాం అంటూ భరోసా ఇస్తోంది ఇండియన్ ఆర్మీ.
ఉగ్రవాద దాడిని తమ కళ్ళ ముందు చూసి తప్పించుకున్న పర్యాటకుల బాధాకరమైన అనుభవం ఇది.. వారికి భరోసా నిస్తూ ధైర్యం చెబుతోంది భారత సైన్యం
హరియాణాకు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేరి కేరళ కోచిలో విధులు నిర్వరిస్తున్నాడు.ఏప్రిల్ 16న పెళ్లి జరిగింది..19న గ్రాండ్ గా విందు నిర్వహించాడు. అనంతరం భార్యతో హనీమూన్ కశ్మీర్ లో ప్లాన్ చేసుకున్నాడు. సంతోషంగా తిరిగిరావాల్సిన వినయ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ మృతదేహం పక్కనే దిక్కుతోచని స్థితిలో కూర్చున్న కొత్త పెళ్లికూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకోనివారులేరు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేదికి ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకున్నాడు..విది నిర్వహణలో బిజీగా ఉండి రీసెంట్ గా కశ్మీర్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 22న జరిగిన కాస్పుల్లో ద్వివేది ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కొక్కరి పేర్లు అడిగి మరీ కాల్పులు జరిపారని ద్వివేది భార్య కన్నీళ్లపర్యంతమయ్యారు. TCSలో ఉద్యోగం కోసం 2019లో అమెరికాకు వెళ్లారు పశ్చిమబెంగాల్ కి చెందిన బితాన్ అధికారి. ఏప్రిల్ 8న బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కోల్‌కతాకు వచ్చి ఏప్రిల్ 16న కాశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే జరిగిన ఈ ఘటన చూసి బితాన్ భార్య సోహిని ,కుమారుడు వణికిపోయారు. లాన్ మీద కూర్చుని ఉన్నాం, అకస్మాత్తుగా సాయుధ వ్యక్తులు వచ్చి చుట్టుముట్టి హిందువులు ఎవరు, ముస్లింలు ఎవరని అడిగారు. కదిలే అవకాశం కూడా లేకుండా కాల్పులు జరిపారని కన్నీళ్లుపెట్టుకున్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరిది ఒక్కో కథ.