Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి. పచ్చదనం పరుచుకున్నట్టు ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం మనదేశీయులనే కాదు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
అక్టోబరు నుంచి ఫిబ్రవరి నుంచి పూర్తిగా మంచుతో కప్పిఉండే పహల్గాం మార్చి నుంచి జూన్ వరకూ సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలా అనిపించడంతో పహల్గాంని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు.
పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఇలాంటి ప్రదేశంలో ఉగ్రదాటి అంటే ఇది టూరిస్టులపై కాదు కాశ్మీరీల ఉపాధిపై, ఆర్థికవ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలంటారు విశ్లేషకులు.
భూతలస్వర్గంగా పిలిచే కశ్మీర్లో నివసించేవారికి పర్యాటకమే ప్రధాన ఆదాయవనరు. ఈ ప్రదేశంలో జరిగిన దాడివల్ల టూరిస్టులు ఇక్కడకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఉగ్రదాడి ఘటన పర్యాటకుల్లో నమ్మకాన్ని కోల్పోవడమే కాదు కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన టూరిజం ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టేసింది. పర్యాటకులపై దూసుకెళ్లిన ఒక్కోతూటా కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్ల వెనక్కు తీసుకెళ్లిపోయింది.
ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రభావంతో ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమేకాదు..స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా రద్దు చేసుకున్నారు.
కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారిక లెక్కలప్రకారం గతేడాది కశ్మీర్ లో 35 లక్షల మంది పర్యటించారు. 2020లో ఈ సంఖ్య 34 లక్షలు ఉండేది..2021 నాటికి కోటి 13 లక్షలుకి చేరింది. 2022 లో కోటి 88 లక్షలు, 2023 లో 2 కోట్ల 11 లక్షలు, 2024 లో ఈ లెక్క 2 కోట్ల 36 లక్షలకి చేరింది.
కేవలం పర్యాటకం వల్ల కశ్మీర్ కి ఏడాదికి 12 వేలకోట్లు ఆదాయం వస్తుందని అధికారిక అంచనా. 2030 నాటికి ఈ ఆదాయం 25 నుంచి 30 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో ఈ అంచనాలు అందుకోవాలంటే మరికొన్నేళ్లు పట్టేస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
వాస్తవానికి మార్చి నుంచి పహల్గాంలో మొదలయ్యే సందడి మే నాటికి భారీగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే సెలవులు ప్రారంభం కావడంతో పర్యాటకుల సందడి మొదలవుతోంది. మే నెలలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సీజన్ ప్రారంభంలోనే ఈ దాడి జరగడంతో ఇక ఈ ఏడాది మొత్తం ఆ ప్రభావం కశ్మీర్ పర్యాటకంపై పడుతుందంటున్నారు విశ్లేషకులు.
పహల్గాంలో వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశాలు చందన్‌వరీ, బైసరన్, శేష్‌నాగ్ లేక్, పంచతర్ణి, అమర్‌నాథ్ గుహ, అరు వ్యాలీ, లిడ్డర్‌వాట్. దాల్ సరస్సులో ఈ సీజన్లో 15వందల కన్నా ఎక్కువ హౌస్ బోట్లు పనిచేస్తాయ్. ఉగ్రదాడికి భయపడి ఇప్పటికే కశ్మీర్లో ఉన్న పర్యాటకులంతా హోటల్స్, బోట్ హౌస్ లు ఖాళీ చేసి తిరుగుప్రయాణం అయ్యారు. దేశ విదేశాల నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారంతా వెనక్కు తగ్గారు. ఈ భయం పర్యాటకులను ఎన్నాళ్లు వెంటాడుతుందో..