Nijjar’s Killing:
న్యూయార్క్‌లో సమావేశం..
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. న్యూయార్క్‌లో Council on Foreign Relations ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రశ్నించింది. Five Eyes ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌పైనా స్పందన ఏంటని అడిగింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన జైశంకర్...ఆ ఇంటిలిజెన్స్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. FBIతో ఏ మాత్రం సంబంధం లేని తనను ఈ ప్రశ్నలు అడగడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తరవాత కూడా మీడియా ప్రశ్నించింది. నిజ్జర్ హత్య గురించి ముందుగానే కెనడా భారత్‌కి చెప్పిందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చిందన్న అంశాన్ని మీడియా ప్రస్తావించింది. అందుకు జైశంకర్ దీటుగానే బదులిచ్చారు. ఎవరైనా అలాంటి సమాచారం అందిస్తే కచ్చితంగా అలెర్ట్ అవుతామని వెల్లడించారు. నిజ్జర్ హత్యకి సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
"నాకు Five Eyesతో ఎలాంటి సంబంధం లేదు. అయినా FBIతో సంబంధం లేని వ్యక్తిని మీరు ఈ ప్రశ్న వేయడం సరికాదు. మీరు అడగాల్సిన వ్యక్తిని అడగాలి. కెనడా నుంచి నిజ్జర్ హత్య గురించి మాకు ఏవో డాక్యుమెంట్‌లు వచ్చాయని అంటున్నారు. నిజంగా అలాంటి సమాచారం అందితే కచ్చితంగా ముందే పరిశీలించి ఉండేవాళ్లం కదా. నిజంగా అలాంటి సమాచారం అంది ఉంటే మేం తప్పకుండా పరిశీలించే వాళ్లం. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కెనడాలో భారత్‌కి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్న వాళ్లను గుర్తించాం. వాళ్లని అప్పగించాలని కెనడాకి చాలా సార్లు విజ్ఞప్తులు చేశాం"
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
ఎన్నో ఏళ్లుగా ఉగ్రచర్యలు..
కెనడాలో చాలా ఏళ్లుగా నేరాలు జరుగుతున్నాయని,ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయని అన్నారు జైశంకర్. అక్కడి ఉగ్ర కార్యకలాపాలపై భారత్ ఎప్పుడో కెనడాని అప్రమత్తం చేసిందని, అయినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు.
"కొన్నేళ్లుగా కెనడాలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని కెనడా దృష్టికి తీసుకెళ్లాం. ఇదంతా ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారన్నదీ చెప్పాం. చాలా సమాచారం కూడా ఇచ్చాం. కెనడాలో లేకున్నా ఇక్కడి నేరాలని బయట నుంచి ఎవరో కంట్రోల్ చేస్తున్న విషయాన్నీ వివరించాం. కొందరిని భారత్‌కి అప్పగించాలనీ విజ్ఞప్తి చేశాం. చాలా మందిని ఉగ్రవాదులుగా గుర్తించాం"
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి