Satyendar Jain in ICU:
వెన్నెముకకు గాయం..
జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఉదయం బాత్‌రూమ్‌లో కాలు జారి పడిపోయిన ఆయనను వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. వెన్నెముకకు తీవ్ర గాయమైనట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచారు. కాలు జారిన కింద పడిన వెంటనే సఫ్‌దర్ జంగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే..సెకండ్ ఒపీనియన్ కోసం దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కి తరలించారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ సత్యేంద్ర జైన్‌ను గతేడాది మే 31వ తేదీన అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. దీన్ దయాళ్ హాస్పిటల్ వైద్యులు ఆయన పరిస్థితిని చూసి వెంటనే LNJP Hospitalకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఇక్కడే సత్యేంద్ర జైన్‌కి ICUలో చికిత్స అందిస్తున్నారు.
"ఇవాళ (మే 25వ తేదీ) ఉదయం 6 గంటలకు బాత్‌రూమ్‌లో సత్యేంద్ర జైన్ కాలు జారి కింద పడిపోయాడు. అక్కడే కాసేపు జనరల్ అబ్జర్వేషన్‌లో ఉంచాం. ఆ తరవాత హాస్పిటల్‌కి తీసుకెళ్లి టెస్ట్‌లు చేయించాం. అక్కడి నుంచి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆయన వెన్నెముక, కాలు, భుజం నొప్పితో తీవ్రంగా బాధ పడుతున్నారు"
- జైలు అధికారులు
అయితే...ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయనకు ఈ దుస్థితి రావడానికి ప్రధాని మోదీయే కారణమని మండి పడ్డారు. సత్యేంద్ర జైన్ త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
"ఏ వ్యక్తైతో ఢిల్లీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కృషి చేశాడో..ఇప్పుడదే వ్యక్తిని చావు బతుకుల్లో నెట్టేశారు. ఇదంతా ఆ డిక్టేటర్ పనే (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ). ఆ నియంతకు ఎప్పుడూ ఒకటే ఆలోచన. ప్రతిపక్షం అనేదే ఉండకూడదు. పూర్తిగా అంతం చేయాలి. ఆయనకు తన గురించి తప్ప ఎవరి గురించీ పట్టదు. దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. అందరికీ ఆయనే న్యాయం చేస్తాడు. సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కుట్రలపై పోరాడేందుకు ఆయనకు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
జైల్లో వేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ సత్యేంద్ర జైన్ దాదాపు 35 కిలోలు తగ్గిపోయాడని ఆరోపిస్తున్నారు ఆయన తరపు న్యాయవాది. ఆయనను టార్చర్ చేస్తున్నారని, ఫుడ్ కూడా సరిగా పెట్టడం లేదని మండి పడ్డారు. ఈ కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని అన్నారు.
Also Read: Germany Recession: యూరప్‌కు దడ మొదలైంది! రెసెషన్‌లోకి జారుకున్న జర్మనీ!