PM Modi :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటన కంటే ముందే మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ మార్పు చేర్పులపై ప్రధాని మోదీ పూర్తి స్థాయి కసరత్తు చేశారని చెబుతున్నారు. తెలంగాణ, రాజస్థాన్‌లకు కేంద్ర మంత్రులను చీఫ్‌లుగా ప్రకటించారు . అలాగే కొంత మంది సీనియర్లను పార్టీ పనుల కోసం రాజీనామా చేయించనున్నారు.  ఈ క్రమంలో గత వారం నుండి దేశ వ్యాప్తంగా కేంద్ర కాబినెట్ లో కీలక మార్పులు జరుగుతాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమయం దగ్గర పడిందని.. ఒకటి రెండు రోజుల్లో  ముహుర్తం ఉండబోతోందని చెబుతున్నారు.                          


బీజేపీ హై కమాండ్ రెండు సార్లు అత్యున్నత మీటింగ్ నిర్వహించింది.  అయినప్పటికి బీజేపీ ఈ కెబినెట్ మార్పులపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అనూహ్యమైన మార్పులు చేయడానికి సిద్ధం కావడం వల్లనే  ఆలస్యం అవుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  హై కమాండ్ నుండి వినిపిస్తున్న ప్రకారం మొత్తం 22 మంది కేంద్ర మంత్రులపై వేస్తూ వేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఇటీవల కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మార్చడం వలన ఆయనను ఎవరితో భర్తీ చేస్తారు ? తెలుగు రాష్ట్రాల నుండి ఎవరిని తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.                                                       


రెండు రోజుల క్రితం డిల్లీ వేదికగా కెబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ బాధ్యతలను అప్పగించిన నాయకుల విషయంలో కీలక మార్పులు గురించి చర్చ జరిగింది.   మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్   సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఈ వారంలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇటీవల కొందరు మంత్రులతో సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. నడ్డాతో నిర్మల కూడా సమావేశమయ్యారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.                       


ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. పాత మిత్రులను దగ్గరకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్డీయే నుంచి విడిపోయిన పార్టీలను కూడా ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఈ నెల 18న ఎన్డీయే సమావేశానికి హాజరుకావాలని వివిధ పార్టీలను ఆహ్వానించింది.  మోదీ ఈ నెల 13, 14 తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. పారిస్‌లో ఈ నెల 14న జరిగే బాస్టిల్లే డే పెరేడ్‌లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.