I-T Department Raids: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు- రూ.100 కోట్లు సీజ్!

ABP Desam   |  Murali Krishna   |  08 Nov 2022 07:03 PM (IST)

I-T Department Raids: ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.100 కోట్లు సీజ్ చేసింది.

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు- రూ.100 కోట్లు సీజ్!

I-T Department Raids: ఝార్ఖండ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో లెక్కల్లో లేని సుమారు రూ.100 కోట్ల లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించినట్లు పేర్కొంది. వీటిని సీజ్ చేసినట్లు తెలిపింది.

నవంబర్‌ 4 నుంచి ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. రాంచీ, గొడ్డా, బెర్మో, దుమ్కా, జంషెడ్‌పుర్‌, ఛాయ్‌బాసా, బిహార్‌లోని పట్నా, హరియాణాలోని గురుగ్రామ్‌, బంగాల్‌లోని కోల్‌కతా ప్రాంతాలు ఉన్నాయి. దాడులు నిర్వహించిన ఎమ్మెల్యేలు కుమార్‌ జైమంగళ్‌ అలియాస్‌ అనుప్‌ సింగ్‌, ప్రదీప్‌ యాదవ్‌.                        - సీబీడీటీ 

రిలీఫ్

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌కు సుప్రీం కోర్టులో సోమవారం బిగ్ రిలీఫ్ దక్కింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సొరేన్‌తో పాటు ఝార్ఖండ్‌ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీం అంగీకరించింది.

మేము ఈ రెండు అప్పీళ్లను అనుమతించాం. అలానే ఝార్ఖండ్ హైకోర్టు జారీ చేసిన 2022, జూన్ 3 ఆర్డర్‌ను పక్కన పెట్టాం. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) నిర్వహించదగినవి కావు.                                                                 "
-        సుప్రీం కోర్టు

మైనింగ్ కుంభకోణం కేసులో సొరేన్‌పై విచారణ కోసం దాఖలైన  ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని ఝార్ఖండ్ హైకోర్టు ఇటీవల సమర్థించింది. అయితే ఈ ఆదేశాలు చెల్లవని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది.

సత్యమేవ జయతే

సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన కాసేపటికే సీఎం హేమంత్‌ సొరేన్‌ 'సత్యమేవ జయతే' అంటూ ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్‌ సోరెన్‌ పేర్కొన్నారు. 

సీఎం సీరియస్

మైనింగ్ కేసులో తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై సీఎం హేమంత్ సొరేన్ ఇటీవల ఘాటుగా స్పందించారు. ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే పన్నాగంలో ఇదంతా భాగమని ఆయన ఆరోపించారు.

నేను దోషి అయితే, మీరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి. అధికార భాజపాను వ్యతిరేకించే వారి గొంతును అణిచివేసేందుకు రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కుట్రకు తగిన సమాధానం వస్తుంది.                                       "
-  హేమంత్ సొరేన్, ఝార్ఖండ్ సీఎం

రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో గత గురువారం హాజరుకావాలని సోరెన్‌ను ఈడీ కోరింది. అయినప్పటికీ సీఎం హాజరు కాలేదు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

Also Read: Rajasthan News: ప్రేమ కోసం 'అతడు'గా మారిన ఆమె- ఇదో జంబలకడిపంబ కథ!

Published at: 08 Nov 2022 07:03 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.