చంద్రుడి దక్షిణ ధృవంపైకి చంద్రయాన్‌ ౩ ప్రయోగం ద్వారా పంపించిన విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ ఫొటో తీసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. నాలుగేళ్ల క్రితం ఇస్రో చంద్రయాన్‌ 2 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు పంపిన ల్యాండర్‌ జాబిల్లిపై దిగలేకపోయింది. కానీ ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో తిరుగుతూనే ఉంది. సెప్టెంబరు 6న చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ డ్యూయల్‌ ఫ్రీకెన్సీ సింథటిక్‌ అపెర్చూర్‌ రాడార్‌ (డీఎఫ్‌ఎస్‌ఏఆర్‌) ద్వారా స్లీప్‌ మోడ్‌లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోలు తీసిందని ఇస్రో తన ఖాతాలో షేర్‌ చేసింది. 


ఇస్రో 2019 సెప్టెంబరులో చంద్రయాన్‌ 2 ను ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసే లక్ష్యంతోనే పంపించింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ప్రయోగం విఫలమై ల్యాండర్‌ క్రాష్‌ ల్యాండయ్యింది. ఆర్బిటర్‌ మాత్రం విజయవంతంగా చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో మరింత జాగ్రత్తగా ఎంతో శ్రమ పడి చంద్రయాన్‌ 3 ను ఇటీవల చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23న చంద్రయాన్‌ 3 ద్వారా పంపిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యి ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా భారత్‌ చరిత్రకెక్కింది. అయితే గతంలో పంపించిన ఆర్బిటర్‌ను ఇస్రో ఈ ప్రయోగం కోసం కూడా ఉపయోగించుకుంది. విజయవంతంగా విక్రమ్‌ను ఆర్బిటర్‌తో అనుసంధానించింది.


చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌లోని డీఎఫ్‌ఎస్‌ఏఆర్‌ చాలా కీలకమైన పరికరమని ఇస్రో వెల్లడించింది. ఎల్‌, ఎస్‌ బ్యాండ్‌ మైక్రోవేవ్‌లతో ఉపయోగించే దీని ద్వారా చంద్రుడి ఉపరితలం ఫొటోలను పంపిస్తుందని తెలిపింది. ఇది అత్యుత్తమ రిజెల్యూషన్‌తో పోలారిమెట్రిక్‌ ఫొటోలను అందిస్తుందని పేర్కొంది. ఇది గత నాలుగేళ్లుగా చంద్రుడి ఉపరితలాన్ని చిత్రీకరిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరిస్తోందని ఇస్రో తెలిపింది. ఇది రాడార్‌ అవ్వడం వల్ల సూర్యుడి వెలుతురు అవసరం లేకుండా ఫొటోలు తీయగలదని వెల్లడించింది.


చంద్రయాన్‌ ౩ నుంచి పంపించిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌   ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం చంద్రుడిపై లూనార్‌ నైట్‌ కావడంతో అవి స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లాయి. పద్నాలుగు రోజుల పాటు రోవర్‌, ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవం నుంచి ఇస్రోకు కీలకమైన సమాచారం అందించాయి. ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి ల్యూనార్‌ డే ప్రారంభమవుతుంది. చంద్రుడిపై తిరిగి సూర్యకాంతి పడుతుంది. అయితే తిరిగి ల్యాండర్‌, రోవర్‌ పనిచేస్తాయా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.